Share News

Currency Depreciation: అయ్యో..రూపాయే!

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:43 AM

భారత కరెన్సీ సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఏకంగా 98 పైసలు నష్టపోయి రూ.89.66 వద్ద ముగిసింది....

Currency Depreciation: అయ్యో..రూపాయే!

  • సరికొత్త రికార్డు కనిష్ఠానికి రూపాయి మారకం విలువ

  • ఒక్కరోజే 98 పైసల పతనం

  • తొలిసారిగా రూ.89 దాటిన డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు

ముంబై: భారత కరెన్సీ సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఏకంగా 98 పైసలు నష్టపోయి రూ.89.66 వద్ద ముగిసింది. డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.89 స్థాయిని దాటడం ఇదే తొలిసారి. అంతేకాదు, గడిచిన 3 ఏళ్లకు పైగా కాలంలో రూపాయికి ఇదే అతిపెద్ద ఒక్కరోజు క్షీణత. 2022 ఫిబ్రవరి 24న రూపాయి మారకం విలువ 99 పైసలు క్షీణించింది. రూపాయి మారకం విలువకు క్రితం ఆల్‌టైం ఇంట్రాడే కనిష్ఠం సెప్టెంబరు 30న రూ.88.85 వద్ద నమోదు కాగా.. అక్టోబరు 14న రూ.88.81 వద్ద క్రితం ఆల్‌టైమ్‌ ముగింపు నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి విలువ 4.6 శాతం మేర తగ్గింది. ఆసియాలోకెల్లా అత్యధికంగా తరిగిపోయిన కరెన్సీ మనదే.

  • దేశీయ దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడం

  • ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఓ భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది

  • అంతర్జాతీయంగా 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ మళ్లీ బలపడటం. డాలర్‌ ఇండెక్స్‌ 100కు చేరుకుంది

  • టెక్నాలజీ షేర్లలో భారీగా అమ్మకాల కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి

  • ట్రంప్‌ సుంకాలతో పెరిగిన వాణిజ్య సంబంధ అనిశ్చితులు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ మన కరెన్సీపై గడిచిన కొన్ని నెలలుగా ఒత్తిడి పెంచాయి

  • గత నెల ఎగుమతులు 11 శాతానికి పైగా క్షీణించి, బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడమూ కరెన్సీ మారకంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది

  • అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యమవుతుండటమూ ఇన్వెస్టర్లను కలవర పెడుతున్నది.


త్వరలోనే రూ.90 దాటొచ్చు..

రూపాయి మారకం విలువ మున్ముందు మరింత క్షీణించవచ్చని యా వెల్త్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ అనూజ్‌ గుప్తా అన్నారు. డిసెంబరులో ఫెడ్‌ రేట్లు మరింత తగ్గవచ్చన్న ఆశలు ఆవిరైపోతుండటంతో డాలర్‌ మళ్లీ పుంజుకుంటోందన్నారు. ఇప్పటికే 100కు చేరిన డాలర్‌ ఇండెక్స్‌ త్వరలో 102-103కు చేరుకోచ్చని, దేశీయంగా డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు త్వరలోనే రూ.90కి చేరవచ్చని గుప్తా అభిప్రాయపడ్డారు.


ఇవీ చదవండి:

బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

హీరో, టీవీకే చీఫ్ విజయ్‏కి పోలీసుల షాక్... ఆయన ప్రచారానికి..

Updated Date - Nov 22 , 2025 | 07:08 AM