Rupee Depreciation: రూపీ.. కొత్త కనిష్ఠం
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:12 AM
భారత కరెన్సీ సరికొత్త కనిష్ఠానికి పతనమైంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఏకంగా 45 పైసలు క్షీణించి రూ.88.73 వద్ద ముగిసింది.
ఒక్కరోజులో 45 పైసలు క్షీణించిన రూపాయు
డాలర్ మారకంలో రూ.88.73కు చేరిక
ముంబై: భారత కరెన్సీ సరికొత్త కనిష్ఠానికి పతనమైంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఏకంగా 45 పైసలు క్షీణించి రూ.88.73 వద్ద ముగిసింది. హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో భారత ఐటీ సేవల ఎగుమతులకు భారీగా గండిపడవచ్చని, అమెరికా నుంచి రెమిటెన్స్‌లు తగ్గవచ్చన్న ఆందోళనలతో పాటు మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎ్‌ఫఐఐ) ఉపసంహరణ మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజీలో డాలర్-రూపీ ఎక్స్ఛేంజీ రేటు మంగళవారం రూ.88.41 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో ఆల్‌టైం ఇంట్రాడే కనిష్ఠం రూ.88.82 వద్దకు చేరింది. చివరికి 47 పైసల నష్టంతో రూ.88.75 వద్ద స్థిరపడింది. సోమవారం ట్రేడింగ్‌లోనూ రూపాయి 12 పైసలు కోల్పోయింది.
రూ.90 దిశగా పయనం..
హెచ్1బీ వీసా ఫీజు పెంపు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ అంశాలు మున్ముందు రూపాయిపై మరింత ఒత్తిడి పెంచవచ్చని మిరాయ్ అసెట్ షేర్‌ఖాన్ కరెన్సీ అండ్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరీ అన్నారు. డాలర్-రూపీ మారకం రేటు రూ.88.45-89.20 శ్రేణిలో ట్రేడయ్యే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు.
ఎగుమతిదారులకు స్వల్ప ఊరట
ట్రంప్ సుంకాలతో సతమతం అవుతున్న ఎగుమతిదారులకు రూపాయి క్షీణత కొంత ఊరటనివ్వనుంది. రూపాయి విలువ తగ్గిన ఫలితంగా ఎగుమతులపై గతంలో కంటే అధిక ఆదాయం లభించనుంది. దిగుమతిదారులపైన మాత్రం భారం మరింత పెరగనుంది. ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతులకు మరింత అధికంగా వెచ్చించాల్సి వస్తుంది. రూపాయి క్షీణత స్వల్పకాలంలో ఎగుమతిదారులకు ప్రయోజనకరమే అయినప్పటికీ, మారకం రేటులో స్థిరత్వమే దీర్ఘకాలంలో మేలు చేస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎ్‌ఫఐఈఓ) అధ్యక్షుడు ఎస్‌సీ రల్హాన్ అన్నారు.