Share News

HPV Cancer Vaccine: హెచ్‌పీవీ 9 వ్యాక్సిన్‌ తయారీలోకి బీఈ

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:44 AM

ప్రజలను హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ నుంచి కాపాడేందుకు హెచ్‌పీవీ 9 వ్యాక్సిన్‌ తయారీ కోసం చైనా బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ రెక్‌బయో టెక్నాలజీతో హైదరాబాద్‌ కేంద్రం గా ఉన్న బయోలాజిక్‌-ఈ (బీఈ) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

HPV Cancer Vaccine: హెచ్‌పీవీ 9 వ్యాక్సిన్‌ తయారీలోకి బీఈ

  • చైనా కంపెనీ రెక్‌బయోతో భాగస్వామ్య ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రజలను హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ నుంచి కాపాడేందుకు హెచ్‌పీవీ 9 వ్యాక్సిన్‌ తయారీ కోసం చైనా బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ రెక్‌బయో టెక్నాలజీతో హైదరాబాద్‌ కేంద్రం గా ఉన్న బయోలాజిక్‌-ఈ (బీఈ) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బీఈతో లైసెన్సింగ్‌ సహకార ఒప్పందం కుదిరినట్టు జియాంగ్సు రెక్‌బయో టెక్నాలజీ కంపెనీ వెల్లడించింది. ఈ ఒప్పందానికి అనుగుణంగా బీఈకి తాము రీ కాంబినెంట్‌ 9-వాలెంట్‌ హెచ్‌పీవీ (హెచ్‌పీవీ 9) వ్యాక్సిన్‌ టెక్నాలజీ బదిలీని ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది. అలాగే ఆ వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాన్ని (డీఎస్‌) కూడా రెక్‌బయో అందిస్తుంది. టెక్నాలజీ బదిలీ పూర్తి కాగానే భారీ పరిమాణంలో హెచ్‌పీవీ9 వ్యాక్సిన్‌ తయారీని బీఈ ప్రారంభిస్తుంది. వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ డెవల్‌పమెంట్‌, రెగ్యులేటరీ అనుమతుల విషయంలో బీఈకి అవసరమైన మద్దతును అందించనున్నట్టు రెక్‌బయో తెలిపింది. ఇదిలా ఉండగా ఆ వ్యాక్సిన్‌ తమ ప్లాంట్‌లో తయారుచేసి, దేశం లో వాణిజ్యపరంగా విడుదల చేయడంతో పాటు యునిసెఫ్‌, పీఏహెచ్‌ఓ టెండర్లలో పాల్గొనే అవకాశం బీఈకి ఈ ఒప్పందం ద్వారా లభిస్తుంది. సర్వైకల్‌, వుల్వా, వెజైనల్‌, ఆనల్‌, ఓరోఫరింజియల్‌ క్యాన్సర్లు సహా 9 రకాల క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) చికిత్స కోసం జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ టెక్నిక్‌లను ఉపయోగించి తయారుచేసే (రీకాంబినెంట్‌) వ్యాక్సిన్‌ ఇది. 9-45 సంవత్సరాల మధ్య వయస్కుల్లో వినియోగించే మరో కీలక ఉత్పత్తి ఆర్‌ఈసీ 603పై ప్రస్తుతం చైనాలో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.

Updated Date - Jul 01 , 2025 | 02:46 AM