Share News

RBI Cheque Clearance: గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్‌

ABN , Publish Date - Aug 14 , 2025 | 02:33 AM

బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్‌ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం బ్యాంక్‌లో సమర్పించిన చెక్కు క్లియరెన్స్‌కు 2 రోజుల సమయం పడుతుండగా.. ఈ అక్టోబరు 4 నుంచి ఆ ప్రక్రియ కొద్ది గంటల్లోనే పూర్తికానుంది...

RBI Cheque Clearance: గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్‌

అక్టోబరు 4 నుంచి అమలు.. ప్రస్తుతం 2 రోజుల వరకు సమయం

ముంబై: బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్‌ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం బ్యాంక్‌లో సమర్పించిన చెక్కు క్లియరెన్స్‌కు 2 రోజుల సమయం పడుతుండగా.. ఈ అక్టోబరు 4 నుంచి ఆ ప్రక్రియ కొద్ది గంటల్లోనే పూర్తికానుంది. ఇందుకోసం చెక్కుల ట్రంకేషన్‌ సిస్టమ్‌ను (సీటీఎస్‌) ప్రస్తుతం అనుసరిస్తున్న బ్యాచ్‌ ప్రాసెసింగ్‌ పద్ధతి నుంచి కంటిన్యుయస్‌ క్లియరింగ్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ ఆన్‌ రియలైజేషన్‌ పద్ధతికి మార్చనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాచ్‌-ప్రాసెసింగ్‌ విధానంలో నిర్దిష్ట సమయం వరకు వచ్చిన చెక్కులన్నింటినీ ఒక బ్యాచ్‌గా ప్రాసెస్‌ చేసి, క్లియర్‌ చేస్తారు. ఈ విధానంలో చెక్కు క్లియరెన్స్‌కు రెండు రోజుల వరకు సమయం పడుతుంది. కొత్తగా ప్రవేశపెడుతున్న కంటిన్యుయస్‌ క్లియరింగ్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ ఆన్‌ రియలైజేషన్‌ పద్ధతిలో బ్యాంక్‌లు ప్రజెంటేషన్‌ సెషన్‌లో (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు) కస్టమర్లు సమర్పించిన చెక్కులను ఎప్పటికప్పుడు స్కాన్‌ చేసి, క్లియరింగ్‌ హౌస్‌కు పంపుతాయి. తద్వారా కొన్ని గంటల సమయంలోనే చెక్కు క్లియర్‌ కానుంది. చెక్కు ద్వారా చెల్లింపులు జరిపేవారికి, సొమ్ము అందుకునేవారికీ ఈ విధానం లాభదాయకం కానుంది.

రెండు దశల్లో అమలు

కంటిన్యుయస్‌ క్లియరింగ్‌కు మారే ప్రక్రియ రెండు విడతల్లో జరగనుంది. అక్టోబరు 4 నుంచి తొలి విడత, 2026 జనవరి 3 నుంచి రెండో విడతను అమలు చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. తొలి విడతలో డ్రాయీ బ్యాంక్‌లు తమ వద్దకు వచ్చిన చెక్కులకు అంగీకారం లేదా తిరస్కారాన్ని కన్ఫర్మేషన్‌ సెషన్‌ ముగిసేలోపు (రాత్రి 7 గంటలు) తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ చెక్కును అంగీకరించినట్లుగా భావించి, పరిష్కరించడం జరుగుతుంది. రెండో విడతలో డ్రాయీ బ్యాంక్‌లు తమకు అందిన చెక్కుల సెటిల్‌మెంట్‌పై అంగీకారం లేదా తిరస్కారాన్ని 3 గంటల్లో తెలియజేయాల్సి ఉంటుంది. చెక్కు సెటిల్‌మెంట్‌ అనంతరం క్లియరింగ్‌ హౌస్‌ ఆ చెక్కు అంగీకారం లేదా తిరస్కార సమాచారాన్ని ప్రజెంటింగ్‌ బ్యాంక్‌కు (కస్టమరు చెక్కు సమర్పించిన బ్యాంక్‌) వెల్లడించాల్సి ఉంటుంది. నిర్దేశిత తేదీ నుంచి కొత్త విధానంలోకి మారేందుకు బ్యాంక్‌లు తమ సీటీఎ్‌సను సిద్ధం చేసుకోవాలని ఆర్‌బీఐ కోరింది.

Updated Date - Aug 14 , 2025 | 02:33 AM