పసిడి రుణాలపై నియంత్రణ
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:38 AM
పసిడి రుణాలు గణనీయంగా పెరిగిపోతుండటంతో వీటిపై ఆర్‌బీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ రుణాల మంజూరుకు సంబంధించి ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలతో ఈ రుణాల..

ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్‌బీఐ
పసిడి రుణాలు గణనీయంగా పెరిగిపోతుండటంతో వీటిపై ఆర్‌బీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ రుణాల మంజూరుకు సంబంధించి ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలతో ఈ రుణాల మంజూరు ప్రక్రియ మరింత పారదర్శకంగా మారి రుణాలు తీసుకునే వారితో పాటు రుణాలు ఇచ్చే సంస్థలకూ మేలు జరుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. పసిడి రుణాలకు సంబంధించి ఏయే మార్పులు చోటు చేసుకోనున్నాయంటే..
చెల్లించే స్థోమతే కీలకం: బ్యాంకులు ఇక దరఖాస్తు చేసిన వెంటనే గతంలోలా ఎడాపెడా పసిడి రుణాలు ఇవ్వవు. దరఖాస్తుదారుడి ఆదాయం, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే స్థోమత ఉందా? లేదా? అని మదింపు చేసిన తర్వాతే ఇక ఈ రుణాలు మంజూరవుతాయి.
పునరుద్ధరణ, టాప్ అప్స్: బంగారం రుణాల రెన్యువల్, టాప్ అప్ నిబంధనలూ మారనున్నాయి. ఇప్పటికే ఉన్న గోల్డ్ లోన్ ప్రామాణిక తరగతిలో ఉండి.. నిర్ణీత పరిమితికి లోబడి ఉంటేనే రెన్యూవల్స్, టాప్ అప్‌లను అనుమతిస్తారు.
వెలకట్టడంలో పారదర్శకత: రుణం కోసం తాకట్టు పెట్టుకునే నగల స్వచ్ఛత, విలువను లెక్కించే విధానాలు మరింత పారదర్శకంగా, నిలకడగా ఉండాలని స్పష్టం చేసింది.
కలగలుపు విధానానికి చెక్: ప్రస్తుతం ఒక వ్యక్తి ఒకేసారి వ్యక్తిగత, వ్యాపార అవసరాలు రెంటికీ కలిపి ఒకే పసిడి రుణం తీసుకోవచ్చు. ఇకపై ఇది సాధ్యం కాదు.
పర్యవేక్షణ: ఇక ఏ అవసరం కోసం గోల్డ్ లోన్ తీసుకున్నామో, ఆ రుణాన్ని ఆ అవసరం కోసం మాత్రమే ఉపయోగించాలి. వేరే అవసరాలకు ఉపయోగించకూడదు. ఈ రుణ వినియోగం నిర్దేశించిన అవసరానికే వినియోగిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని బ్యాంకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేస్తాయి.
పరిమితులు
వ్యక్తిగత వినియోగ అవసరం కోసం బంగారం రుణం తీసుకుంటే దాన్ని 12 నెలల్లోగా చెల్లించాలి.
ఒక్కో వ్యక్తికి సహకార బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు మంజూరు చేసే పసిడి రుణాలు రూ.5 లక్షలు మించకూడదు.
ఒక వ్యక్తికి ఒక కిలో ఆభరణాల వరకు మాత్రమే పసిడి రుణాలకు అనుమతిస్తారు.
పసిడి నాణేలపై రుణాలు తీసుకోవాలంటే 50 గ్రాముల వరకే అనుమతిస్తారు. ఆ నాణేలు కూడా 22 క్యారట్స్ లేదా అంతకు మించిన స్వచ్ఛత ఉండి ప్రత్యేకంగా ముద్రించినవై, బ్యాంకులు అమ్మినవై ఉండాలి.
బంగారు, వెండి నగలు, నాణేలపై మాత్రమే ఇక పసిడి రుణాలు లభిస్తాయి. నేరుగా బంగారం లేదా వెండిని కుదువ పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండదు.
గోల్డ్ ఈటీఎ్‌ఫలపైనా పసిడి రుణాలు లభించవు.
పసిడి రుణాల కోసం వివాదాల్లో ఉన్న ఆభరణాలు, ఇప్పటికే తనఖాలో ఉన్న ఆభరణాలను తిరిగి తనఖా పెట్టేందుకు అనుమతించరు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..