Reserve Bank of India: ఎగుమతి ఆదాయాలు 15 నెలల్లో తెచ్చుకోవచ్చు
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:00 AM
ఎగుమతిదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ భారీ ఊరట కల్పించింది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాలను వారు 15 నెలల్లోగా దేశానికి తెచ్చుకోవచ్చంటూ నిబంధన సడలించింది...
అమెరికా సుంకాల నేపథ్యంలో ఆర్‌బీఐ ఊరట
ముంబై: ఎగుమతిదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారీ ఊరట కల్పించింది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాలను వారు 15 నెలల్లోగా దేశానికి తెచ్చుకోవచ్చంటూ నిబంధన సడలించింది. ఇప్పటి వరకు ఈ గడువు 9 నెలలే ఉండేది. భారతీయ ఎగుమతులపై అమెరికా ఆగస్టు నుంచి సుంకాలు 50 శాతానికి పెంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ ఈ సడలింపు ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ (వస్తుసేవల ఎగుమతులు) నిబంధనలకు సవరణలు చేయడంతో ఆర్‌బీఐ కూడా తన నిబంధనల్లో తగు మార్పులు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ (వస్తు సేవల ఎగుమతులు) (రెండో సవరణ) నిబంధనలు, 2025 పేరిట ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్.పి.దా్‌స నవంబరు 13వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ గెజిట్‌లో అధికారికంగా ప్రచురించిన తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. గతంలో కొవిడ్ సమయంలో కూడా 2020 సంవత్సరంలో ఎగుమతిదారులకు ఇలాంటి సడలింపు ఇచ్చారు. ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో బుధవారం నాటి సమావేశంలో కేంద్ర క్యాబినెట్ రూ.45,000 కోట్ల విలువ గల రెండు పథకాలకు ఆమోదముద్ర వేసిన విషయం విదితమే.
కేంద్ర బ్యాంక్ ప్రకటనలు సమతూకంగా ఉండాలి
కేంద్ర బ్యాంక్ చేసే ప్రకటనలు పారదర్శకత, గోప్యత రెండింటి మధ్య సమతూకంగా ఉండాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము సూచించారు. సీసెన్ సెంటర్, ఆర్‌బీఐ ఉమ్మడిగా నిర్వహించిన కేంద్ర బ్యాంక్ అకౌంటింగ్ విధానాల అంతర్జాతీయ సదస్సులో ప్రధానోపన్యాసం చేస్తూ కేంద్ర బ్యాంకుల ప్రధాన బాధ్యత ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం నెలకొల్పడమే అయినప్పటికీ అవి జారీ చేసే ఆదేశాలు విభిన్న అధికార పరిధుల్లో ఉంటాయని ఆయన తెలిపారు. అయితే కేంద్ర బ్యాంకులకు ప్రపంచవ్యాప్తంగా వర్తించే అకౌంటింగ్ ప్రమాణం ఒక్కటీ లేదని, అందువల్ల కేంద్ర బ్యాంకులు అనుసరించే ప్రమాణాల్లో నిర్దిష్ట స్వభావం, లోతు, ప్రాధాన్యత ఉండాలని ముర్ము సూచించారు.