Public Sector Banks Earnings: పీఎస్‌బీల లాభాల్లో సరికొత్త రికార్డు
ABN , Publish Date - May 10 , 2025 | 06:04 AM
2024-25 ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల లాభాలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.1.78 లక్షల కోట్లకు చేరింది, ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే రూ.37,100 కోట్లు పెరిగింది.
2024-25లో రూ.1.78 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) గాను దేశంలోని డజను ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల మొత్తం వార్షిక లాభం సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.1.78 లక్షల కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఈ 12 పీఎస్‌బీల మొత్తం లాభం రూ.1.41 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే, 2023-24తో పోలిస్తే 2024-25లో ప్రాఫిట్ రూ.37,100 కోట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి నమోదైన పీఎస్‌బీల మొత్తం లాభం రూ.1,78,364 కోట్లలో 40 శాతం వాటా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)దే. గతసారి ఎస్‌బీఐ వార్షిక లాభం రూ.70,901 కోట్లుగా నమోదైంది. 2023-24లో నమోదైన రూ.61,077 కోట్లతో పోలిస్తే 16 శాతం అధికం. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) లాభం అన్నిటికంటే అత్యధికంగా 102 శాతం వృద్ధి చెంది రూ.16,630 కోట్లకు చేరింది.