PFRDA Chairperson S Raman: అందరికీ పెన్షన్ మా లక్ష్యం
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:02 AM
సంఘటిత, అసంఘటిత రంగా ల్లో పనిచేసే అందరికీ పెన్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్...
వృద్ధాప్యాని కల్లా సంపన్నులు కావాలి
పీఎ్‌ఫఆర్‌డీఏ చైర్‌పర్సన్ రామన్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సంఘటిత, అసంఘటిత రంగా ల్లో పనిచేసే అందరికీ పెన్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ (పీఎ్‌ఫఆర్‌డీఏ) చైర్‌పర్సన్ ఎస్ రామన్ తెలిపారు. ఇందుకోసం ‘వృద్ధాప్యం సమీపించే లోపే ధనవంతులు కండి’ అనే నినాదంతో పనిచేస్తున్నట్టు ప్రకటించారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎ్‌స) ఎంపవరింగ్ కార్పొరేట్స్, ఎనేబిలింగ్ భారత్’ అనే అంశంపై జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం ప్రకటించారు. దేశంలో 55 కోట్ల మంది ఉద్యోగుల్లో సంఘటిత రంగంలో పనిచేస్తున్న 10 కోట్ల మంది ఉద్యోగులకు మాత్రమే ప్రస్తుతం పెన్షన్ సదుపాయం ఉందన్నారు. 20-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న సంఘటిత రంగంలోని ఉద్యోగుల్లోనూ చాలా మందికి పెన్షన్ పథకాలపై సరైన అవగాహన లేదన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడే తమ రిటైర్మెంట్ జీవితానికి ఆర్థిక చేయూత ఇచ్చే పెన్షన్ ఫండ్ ఖాతా కూడా ప్రారంభించాలని రామన్ కోరారు.
నెలకు రూ.3,000 పెట్టుబడితో పెన్షన్ ఫండ్ ఖాతా ప్రారంభించి ఏటా 2-3 శాతం పెంచుకుంటూ పోతే ఏటా సగటున 9.2 శాతం రాబడులు పొందవచ్చన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్ ద్వారా రెండు మూడు నిమిషాల్లోనే పెన్షన్ ఫండ్ ఖాతా ఓపెన్ చేయవచ్చన్నారు. పెన్షన్ ఫండ్ ఖాతా చెల్లింపులూ అంతే ఈజీగా చేయవచ్చని పీఎ్‌ఫఆర్‌డీఏ చైర్‌పర్సన్ రామన్ తెలిపారు.