Top Export Sectors India: ఎగుమతుల్లో 4 రంగాలదే 50శాతం పైగా వాటా
ABN , Publish Date - May 17 , 2025 | 02:51 AM
2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతుల్లో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల వాటా 54.3 శాతంగా నమోదైంది. ఈ రంగాల్లో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024-25) భారత ఎగుమతుల్లో 50 శాతానికి పైగా వాటా వ్యవసాయం, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులదేనని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దేశంలో తయారీని, విలువ ఆధారిత ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో భారత్ భిన్న రంగాల్లో బలోపేతమవుతుందని ఇది సూచిస్తోంది. 2024-25లో భారత్ నుం చి 43,742 కోట్ల డాలర్ల ఎగుమతులు జరిగాయి. ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఈ విలువ దాదాపు రూ.37.40 లక్షల కోట్లు. అందులో ఇంజనీరింగ్ ఉత్పత్తుల వాటా 26.67 శాతంగా ఉండగా.. వ్యవసాయ రంగం 11.85శాతం, ఫార్మా 6.96శాతం, ఎలకా్ట్రనిక్స్ 8.82 వాటా కలిగి ఉన్నాయి. ఈ నాలుగు రంగాల మొత్తం వాటా 54.3 శాతంగా ఉంది.
గత ఆర్థిక సంవత్సరం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 32.46 శాతం వృద్ధితో 3,858 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.3.30 లక్షల కోట్లు) పెరిగాయి. ప్రధానంగా యూఏఈ, అమెరికా, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇటలీకి ఈ ఎగుమతులు జరిగాయి.
ఇంజనీరింగ్ ఉత్పత్తులు 6.74 శాతం పెరిగి 11,667 కోట్ల డాలర్లకు (రూ.9.98 లక్షల కోట్లు) చేరాయి. అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, యూకే, జర్మనీకి ఈ ఉత్పత్తుల ఎగుమతులు అధికంగా జరిగాయి.
ఔషధాల ఎగుమతులు 9.4 శాతం వృద్ధితో 3,047 కోట్ల డాలర్లుగా (రూ.2.61 లక్షల కోట్లు) నమోదయ్యాయి. మన ఔషధాలు 200కు పైగా దేశాలకు ఎగమతవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రంగ ఎగుమతులు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.
వ్యవసాయం, దాని సంబంధిత రంగాల నుంచి ఎగుమతులు 7.36 శాతం పెరిగి 5,186 కోట్ల డాలర్లకు (రూ.4.43 లక్షల కోట్లు) చేరాయి.