Stablecoins for Money Transfers to India: స్టేబుల్ కాయిన్స్‌పై ప్రవాసుల మొగ్గు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:54 AM
ప్రవాస భారతీయులు ఎన్‌ఆర్‌ఐ స్వదేశానికి డబ్బులు పంపించే విధానం మారిపోతోంది. ఇది వరకటిలా వారు బ్యాంకింగ్ చానల్స్‌ను ఆశ్రయించడం లేదు...
స్వదేశానికి పంపించే నగదు విధానంలో మార్పులు
డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యూఎ్‌సడీటీ వినియోగం
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) స్వదేశానికి డబ్బులు పంపించే విధానం మారిపోతోంది. ఇది వరకటిలా వారు బ్యాంకింగ్ చానల్స్‌ను ఆశ్రయించడం లేదు. డాలర్ మారకంతో ముడిపడిన యూఎ్‌సడీటీ వంటి స్ట్టేబుల్ కాయిన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకింగ్ చానల్స్‌తో పోలిస్తే వీటి ద్వారా పంపించే నగదు బదిలీలకు రూపాయిల్లో 4 నుంచి 5 శాతం ప్రీమియం లభించడం ఇందుకు ప్రధాన కారణం. ఉదాహరణకు దుబాయ్ లేదా అమెరికాలోని ఒక ఎన్‌ఆర్‌ఐ భారత్‌లోని తన లేదా తమ బంధువుల బ్యాంకు ఖాతాకు 1,000 డాలర్లు పంపిస్తే సోమవారం నాటి డాలర్-రూపీ మారకం రేటు ప్రకారం భారత్‌లోని వారి బ్యాంకు ఖాతాల్లో రూ.88,711 జమవుతాయి. అదే క్రిప్టో కరెన్సీకి చెందిన యూఎ్‌సడీటీ అనే స్టేబుల్ కాయిన్ కొని అక్కడి స్థానిక మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ల ద్వారా భారత్‌కు పంపిస్తే దాదాపు రూ.94,000 జమవుతాయి.
బదిలీ ఇలా...
కాకపోతే ఆ మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ ఆ స్టేబుల్ కాయిన్స్‌ను మళ్లీ భారత్‌లోని మరో అనధికారిక మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌కు అమ్ముతాడు. ఇక్కడి ఏజెంట్ ఆ రోజు ఉన్న డాలర్-రూపీ మారకం రేటు ప్రకారం అమెరికా లేదా దుబాయ్ నుంచి డబ్బు పంపించే లేదా వారు చెప్పిన వ్యక్తుల చేతికి లేదా బ్యాంకులో ఈ మొత్తాన్ని జమ చేస్తాడు. అయితే ఇది అనధికారికం కావడంతో ఎక్కువ మంది దీనికి ఇష్టపడడం లేదు. అయినా ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐలు స్వదేశానికి పంపించే డబ్బుల్లో 3 నుంచి 4 శాతం ఈ మార్గంలో వస్తున్నట్టు సమాచారం.