మళ్లీ 25000 పైకి నిఫ్టీ
ABN , Publish Date - May 16 , 2025 | 04:56 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ, మదుపరులు ఒక్కసారిగా కొనుగోళ్లు పెంచడంతో భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1,200.18 పాయింట్ల (1.48 శాతం) వృద్ధితో...
సెన్సెక్స్ 1,200 పాయింట్లు అప్.. 82,500 ఎగువన ముగిసిన సూచీ
7 నెలల గరిష్ఠ స్థాయికి మార్కెట్
2 రోజుల్లో రూ.9 లక్షల కోట్ల వృద్ధి
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ, మదుపరులు ఒక్కసారిగా కొనుగోళ్లు పెంచడంతో భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1,200.18 పాయింట్ల (1.48 శాతం) వృద్ధితో ఏడు నెలల గరిష్ఠ స్థాయి 82,530.74 వద్దకు చేరింది. నిఫ్టీ సైతం 395.20 పాయింట్లు (1.60 శాతం) పెరిగి 25,062.10 వద్దకు ఎగబాకింది. సూచీ మళ్లీ 25,000 పైకి చేరడం 7 నెలల (2024 అక్టోబరు 15) తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దాదాపు అన్ని వస్తువులపై భారత్ సుంకాలను సున్నాకు తగ్గించనుందంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దాంతో భారత్-అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో మార్కెట్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సూచీలు లాభపడటం వరుసగా ఇది రెండో రోజు. ఈ రెండ్రోజుల్లో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.08 లక్షల కోట్ల పెరుగుదలతో రూ.440.19 లక్షల కోట్లకు (5.14 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు 0.94 శాతం వరకు వృద్ధి చెందగా.. రంగాల వారీ సూచీలన్నీ పాజిటివ్‌గా ముగిశాయి. రియల్టీ, ఆటో, సర్వీసెస్, ఇండస్ట్రియల్స్, మెటల్, కన్స్యూమర్ డిస్‌క్రెషనరీ, కమోడిటీస్ సూచీలు 1.87 శాతం వరకు పెరిగాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) రూ.5,393 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ.1,668 కోట్ల షేర్లను విక్రయించారు.
ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మార కం విలువ 22 పైసలు క్షీణించి రూ.85.54 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపీపై ఒత్తిడి పెంచింది.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ ముడి చమురు పీపా ధర ఒక దశలో 3.65 శాతం తగ్గి 63.68 డాలర్లకు దిగివచ్చింది.
ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,800 తగ్గి రూ.95,050కి దిగిరాగా.. వెండి సైతం వరుసగా నాలుగో రోజూ తగ్గుముఖం పట్టింది. కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.97,000కు జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 0.53 శాతం తగ్గి 3,160 డాలర్లకు జారుకోగా.. సిల్వర్ 32.29 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..