Share News

Microsoft Forms Strategic Partnerships: టీసీఎస్‌ ఇన్ఫీ విప్రో కాగ్నిజెంట్‌తో మైక్రోసాఫ్ట్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:21 AM

భారత్‌లో ఏజెంటిక్‌ ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) సేవల వినియోగాన్ని మరింత పెంచేందుకు ఐటీ దిగ్గజ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, విప్రో, కాగ్నిజెంట్‌లతో...

Microsoft Forms Strategic Partnerships: టీసీఎస్‌ ఇన్ఫీ విప్రో కాగ్నిజెంట్‌తో మైక్రోసాఫ్ట్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

నాలుగు ఐటీ సంస్థలకు కో పైలట్‌ ద్వారా ఏజెంటిక్‌ ఏఐ సేవలు

బెంగళూరు: భారత్‌లో ఏజెంటిక్‌ ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) సేవల వినియోగాన్ని మరింత పెంచేందుకు ఐటీ దిగ్గజ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, విప్రో, కాగ్నిజెంట్‌లతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న నాదెళ్ల.. గురువారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ భాగస్వామ్యాల్లో భాగంగా ఒక్కో ఐటీ కంపెనీకి 50,000 చొప్పున నాలుగింటికి మొత్తం 2 లక్షల కో పైలట్‌ లైసెన్సులను మైక్రోసాఫ్ట్‌ అందించనుంది. ఈ ఐటీ కంపెనీల ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ సహా ఇతర ఉత్పత్తుల ద్వారా మరింత వేగంగా, తెలివిగా పనిచేసేందుకు తత్ఫలితంగా కంపెనీ ఉత్పాదకత పెరిగేందుకు ఇది దోహదపడనుందని సత్య నాదెళ్ల అన్నారు.

2 కోట్ల మందికి ఏఐ శిక్షణ

భారత్‌లో 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ అందించనున్నట్లు నాదెళ్ల తెలిపారు. ఏఐ ఆధారిత ఇండస్ట్రీలు, డిజిటల్‌ టూల్స్‌ ద్వారా రూపుదిద్దుకోనున్న ఆర్థిక వ్యవస్థ కోసం భారత కార్మిక శక్తిని సిద్ధం చేసేందుకు ఇది దోహదడనుందన్నారు. ఒకపక్క భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు సహా డిజిటల్‌ మౌలిక వసతులను భారీగా విస్తరిస్తూనే, మరోపక్క ఏఐ నైపుణ్య శిక్షణను కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి భారత ఏఐ రంగంలో తమ కంపెనీ 1,750 కోట్ల డాలర్ల (రూ.1.58 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని మోదీతో మంగళవారం సమావేశమైన అనంతరం నాదెళ్ల ప్రకటించారు. ఆసియాలో కంపెనీకిదే అతిపెద్ద పెట్టుబడి.

వచ్చే జూన్‌కల్లా హైదరాబాద్‌ క్లౌడ్‌ రీజియన్‌ ఆరంభం

డిజిటల్‌ మౌలిక సదుపాయాల కోసం భారీ స్థాయి పెట్టుబడుల ద్వారా భారత్‌లో ఏఐ ఆవరణ వ్యవస్థను విస్తరించే విషయంలో మైక్రోసాఫ్ట్‌ మరింతగా కట్టుబడి ఉందని సత్య నాదెళ్ల అన్నారు. దేశంలో కంపెనీ క్లౌడ్‌ నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరిస్తున్నామన్నారు. ఇప్పటికే పుణె, చెన్నై, ముంబైలో డేటా సెంటర్లను కలిగి ఉన్నామని, వచ్చే ఏడాది ప్రథమార్ధం చివరికల్లా హైదరాబాద్‌లోనూ క్లౌడ్‌ రీజియన్‌ను (డేటా సెంటర్‌) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా డేటా సెంటర్లను నిర్వహిస్తోంది.

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల

ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..

Updated Date - Dec 12 , 2025 | 04:21 AM