Maruti Suzuki: ఐదేళ్లలో మార్కెట్లోకి 8 కొత్త ఎస్‌యూవీలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:48 AM
రాబోయే ఐదేళ్ల కాలంలో ఎనిమిది కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా...
మారుతి సుజుకీ ప్రణాళిక
టోక్యో: రాబోయే ఐదేళ్ల కాలంలో ఎనిమిది కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) ప్రకటించింది. ఈ కొత్త ఎస్‌యూవీలతో కంపెనీకి చెందిన ఎస్‌యూవీల సంఖ్య 28కి చేరుతుంది. భారత మార్కెట్లో 50ు మార్కెట్ వాటా తిరిగి సాధించాలన్నది తమ ధ్యేయమని, ఇందుకు అది సహాయకారి అవుతుందని సుజుకీ మోటార్ కార్పొరేషన్ రిప్రెజెంటేటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ అన్నారు. అయితే తీవ్రమైన పోటీ నెలకొన్న భారత మార్కెట్లో ఆ లక్ష్యాన్ని చేరడం అంత తేలికైన పని కాదని జపాన్ మొబిలిటీ షో సందర్శించిన భారతీయ విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. మారుతి సుజుకీలో సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు 58ు వాటా ఉంది. సుమారు 43 లక్షల వాహనాల సామర్థ్యం గల భారత మార్కెట్లో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య కాలంలో మారుతి సుజుకీ వాటా 39 శాతానికి తగ్గింది. రాబోయే కాలంలో 50ు మార్కెట్ వాటా తిరిగి సాధించడంతో పాటు విద్యుత్ కార్ల ఉత్పత్తి, ఎగుమతుల్లో నంబర్ వన్ కావాలనుకుంటున్నట్టు సుజుకీ చెప్పారు. కాగా, 2030-31 నాటికి దేశంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు మారుతి సుజుకీ ఇప్పటికే ప్రకటించింది.