Sensex Ends Slightly Lower: లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:06 AM
గురువారం ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోయిన ఈక్విటీ మార్కెట్ సూచీ లు వారాంతపు రోజైన శుక్రవారం నాడు నీరసపడ్డాయి....
సెన్సెక్స్ 14 పాయింట్లు పతనం
ముంబై: గురువారం ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోయిన ఈక్విటీ మార్కెట్ సూచీ లు వారాంతపు రోజైన శుక్రవారం నాడు నీరసపడ్డాయి. జీడీపీ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దూరంగా ఉండడం మార్కెట్‌ను కుంగదీసింది. శుక్రవారం రెండు రోజుల ర్యాలీకి తెర దించిన సెన్సెక్స్ 13.71 పాయింట్ల నష్టంతో 85,706.67 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 392 పాయింట్ల మేరకు పెరిగి 85,969.89 గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. మరోవైపు నిఫ్టీ 12.60 పాయింట్లు నష్టపోయి 26,202.95 వద్ద ముగిసింది. గరిష్ఠ స్థాయిల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి పాల్పడ్డారు. దీనికి తోడు విదేశీ నిధుల తరలింపు, ప్రపంచ మార్కెట్లలో ఊగిసలాట ధోరణి సూచీల కదలికలను ప్రభావితం చేసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 474.75 పాయింట్లు, నిఫ్టీ 134.8 పాయింట్లు లాభపడ్డాయి.
డిసెంబరు 3న మీషో ఇష్యూ: ఈ-కామర్స్ కంపెనీ మీషో తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) డిసెంబరు 3వ తేదీన మార్కెట్ తలుపు తట్టనుంది. షేరు ధర శ్రేణిని రూ.105-111గా కంపెనీ నిర్ణయించింది. 5వ తేదీన ఇష్యూ ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా రూ.4,250 కోట్ల విలువ గల తాజా షేర్లు మార్కెట్లో విడుదల చేయనున్నారు. 10.55 కోట్ల షేర్లను ఓఎ్‌ఫఎస్ బాటలో విక్రయిస్తారు.