Share News

Strategic independence: ‘భారత్‌లో తయారీ’పై జర జాగ్రత్త

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:35 AM

మేకిన్‌ ఇండియా (భారత్‌లో తయారీ) కార్యక్రమంపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు.

Strategic independence: ‘భారత్‌లో తయారీ’పై జర జాగ్రత్త

  • పోటీతత్వమే మనకు శ్రీరామ రక్ష

  • ట్రంప్‌ సుంకాలతో మనకు ముప్పే

  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సుబ్బారావు

న్యూఢిల్లీ: మేకిన్‌ ఇండియా (భారత్‌లో తయారీ) కార్యక్రమంపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. ఈ పథకం ‘మనకు అవసరమైన ఉత్పత్తులన్నీ దేశంలోనే తయారీ పథకం’గా మారకుండా చూడాలన్నారు. అలా చేస్తే చైనా+1 వ్యూహంలో భాగంగా మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కంపెనీల పెట్టుబడులకు గండి పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేకిన్‌ ఇండియా పథకం విజయం మన దేశ కంపెనీల పోటీతత్వాన్ని పెంచడంపై ఆధార పడి ఉందే తప్ప, వాటికి పోటీ నుంచి రక్షణ కల్పించడంలో కాదని గుర్తించాలన్నారు. అలా చేస్తే మన కంపెనీల ఉత్పాదక శక్తి కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న ‘ఆత్మనిర్భరత’కు అసలు అర్థం రక్షణ, ఇంధనం వంటి కొన్ని కీలక రంగాల్లో వ్యూహాత్మక స్వయం సమృద్ధే తప్ప, అన్ని రంగాల్లో పూర్తి స్వయం సమృద్ధి కాదని అర్థం చేసుకోవాలని సుబ్బారావు కోరారు.


సుంకాల పోటు తప్పదు: అమెరికా మన దేశంపై విధిస్తున్న సుంకాలపైనా ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అవునన్నా కాదన్నా అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌ అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఈ సుంకాల పోటుతో ‘మేకిన్‌ ఇండియా’ ద్వారా మన దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికీ గండి పడే ప్రమాదం ఉందన్నారు. దీంతో చైనా+1 వ్యూహంలో భాగంగా మన దేశంలో తమ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే విదేశీ కంపెనీలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల 27 నుంచి ట్రంప్‌ విధించిన 25 శాతం అదనపు సుంకంతో కలిపి 50 శాతం సుంకాలు అమల్లోకి వస్తే, ఆసియాలో మన దేశంపైనే అత్యధిక సుంకాలు ఉన్నట్టవుతుందన్నారు. అలాంటి స్థితిలో ఏ కంపెనీ కూడా మన దేశంలో తమ యూనిట్‌ పెట్టి అమెరికాకు ఎగుమతి చేయలేదని సుబ్బారావు స్పష్టం చేశారు. సగం ఎగుమతులపై ప్రభావం ట్రంప్‌ సుంకాల ప్రభావం అమెరికాకు మన దేశం ఎగుమతి చేసే కనీసం సగం ఎగుమతులపై ఉంటుందని సుబ్బారావు స్పష్టం చేశారు. ఈ సుంకాలతో ముఖ్యంగా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న వస్త్ర, రత్నాభరణాలు, తోలు ఉత్పత్తుల కంపెనీలు ఎక్కువగా దెబ్బతింటాయన్నారు. ఫార్మా, ఎలకా్ట్రనిక్‌ పరికరాల దిగుమతులను ప్రస్తుతానికి సుంకాల నుంచి మినహాయించడం తాత్కాలిక ఉపశమనంగానే చూడాలని సుబ్బారావు కోరారు. భవిష్యత్‌లో వీటిపైనా సుంకాల పోటు తప్పక పోవచ్చన్నారు. ఈ సుంకాల నేపథ్యంలో మరో ఐదేళ్లలో భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మూడింతలు పెంచి 50,000 కోట్ల డాలర్లకు పెంచాలనే లక్ష్యమూ సాధ్యం కాదని స్పష్టం చేశారు.


చైనా డంపింగ్‌

అమెరికా సుంకాల పోటుతో చైనా తన వస్తువులను ఇతర దేశాల మార్కెట్లలో కుమ్మరించే ప్రమాదమూ ఉందని సుబ్బారావు హెచ్చరించారు. ఈ మార్కెట్లు కూడా భారత ఎగుమతులకు అమెరికా తర్వాత ప్రధాన మార్కెట్లన్నారు. అదే జరిగితే ఇతర దేశాలకూ మన ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అమెరికా నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతుల కోసం ట్రంప్‌ చేస్తున్న ఒత్తిళ్లపై జాగ్రత్తగా ఉండక తప్పదన్నారు. మరీ తప్పదనుకుంటే తలుపులు బార్లా తెరవకుండా ఆచితూచి వ్యవహరించాలని కోరారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగి ఉన్న పళంగా రష్యా చమురు దిగుమతులను ఆపేయడం కూడా భారత్‌కు అంత శ్రేయస్కరం కాదని సుబ్బారావు స్పష్టం చేశారు. అలా చేస్తే చమురు ధరలు పెరిగి మన ఆర్థిక పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం కూడా భగ్గుమనే ప్రమాదం ఉందని సుబ్బారావు అన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 04:37 AM