Share News

Unemployment in Four Years: ఐటీలో నాలుగేళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం

ABN , Publish Date - Nov 14 , 2025 | 03:41 AM

నిన్న మొన్నటి వరకు ఐటీ ఉద్యోగమంటే ఒక క్రేజ్‌. వారానికి ఐదు రోజుల పని, నెలకు ఐదు లేదా ఆరు అంకెల్లో జీతం. నగరాల్లో కాస్మోపాలిటన్‌ లైఫ్‌, వీకెండ్‌లో ఫ్రెండ్స్‌ లేదా ఫ్యామిలీతో పార్టీలు, విహార యాత్రలు....

Unemployment in Four Years: ఐటీలో నాలుగేళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం

  • కొనసాగుతున్న కొలువుల కోత

  • మరో 50,000 మందిపై పొంచి ఉన్న వేటు?

  • ఇన్‌స్టాహైర్‌ వెల్లడి

న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు ఐటీ ఉద్యోగమంటే ఒక క్రేజ్‌. వారానికి ఐదు రోజుల పని, నెలకు ఐదు లేదా ఆరు అంకెల్లో జీతం. నగరాల్లో కాస్మోపాలిటన్‌ లైఫ్‌, వీకెండ్‌లో ఫ్రెండ్స్‌ లేదా ఫ్యామిలీతో పార్టీలు, విహార యాత్రలు. ఇప్పుడు అదంతా గతం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితి. దినదిన గండం నూరెళ్ల ఆయుష్షులా బతకాల్సిన దుస్థితి. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఐటీ నిపుణుల్లో నిరుద్యోగం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా 7.2 శాతానికి చేరిందని ఐటీ కంపెనీలకు నియామక సేవలు అందించే ఇన్‌స్టాహైర్‌ అనే సంస్థ తెలిపింది.

అంతా టెక్నాలజీ పుణ్యం: ఐటీ రంగంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) ట్రెండ్‌ నడుస్తోంది. ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి డిజిటల్‌ నైపుణ్యాల్లో పట్టు ఉంటేనే ఉద్యోగం. లేకపోతే ‘మీ సేవలు ఇక చాలు’ అని ఐటీ కంపెనీలు.. ఉద్యోగులకు చావు కబురు చల్లగా చెప్పేస్తున్నాయి. దీనికి తోడు అమెరికా, ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టులు తగ్గిపోయాయి. అరకొర ప్రాజెక్టులు వచ్చినా, బిల్లింగ్‌ పెద్దగా పెరగడం లేదు. దీంతో ఖర్చులు పెరిగిపోయి కంపెనీల లాభాలకూ గండి పడుతోంది. ఈ పరిణామాలతో దాదాపు 24 శాతం కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. టీసీఎస్‌ వంటి పెద్ద కంపెనీలతో పాటు కోఫోర్జ్‌ వంటి మధ్య స్థాయి ఐటీ కంపెనీలు ఇప్పటికే పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగాల కోత అమలు చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ దాదాపు 19,755 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఇదే కాలంలో మధ్య స్థాయి ఐటీ కంపెనీ కోఫోర్జ్‌ కూడా 5,000 మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. ఐటీ కంపెనీలు త్వరలో మరో 50,000 మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫ్రెషర్స్‌ డీలా

బీఈ, బీటెక్‌ పూర్తి చేసే వారిలో నూటికి 60-70 శాతం మందికి ఇప్పటి వరకు ఐటీ రంగంలోనే కొలువులు లభించేవి. కంపెనీలు కూడా నేరుగా కాలేజీలకు వెళ్లి ఇంటర్వ్యూలు చేసి తమకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న ఫ్రెషర్లకు ప్లేస్‌మెంట్లు ఇచ్చేవి. ఏఐ పుణ్యమాని ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలోలా ఐటీ కంపెనీలు పెద్దగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు వెళ్లడం లేదు. ఉన్న ఉద్యోగులకే ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి పని కానిచ్చేస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగాలపై గంపెడాశలు పెట్టుకున్న ఫ్రెషర్స్‌ నీరుగారి పోతున్నారు. ఏఐ నైపుణ్యాలపై అవగాహన ఉన్న ఫ్రెషర్లకు మాత్రమే కంపెనీలు కొద్దో గొప్పో అవకాశం ఇస్తున్నాయి.

Updated Date - Nov 14 , 2025 | 03:41 AM