Share News

IPO market: ఐపీఓ మార్కెట్లో రికార్డుల హోరు

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:26 AM

ప్రస్తుత సంవత్సరం (2025) పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నాటికి 101 పెద్ద కంపెనీలు, 254 చిన్న, మధ్య....

IPO market: ఐపీఓ మార్కెట్లో రికార్డుల హోరు

  • ఈ ఏడాది ఇప్పటి వరకు 355 ఐపీఓలు ఫ రూ.1.85 లక్షల కోట్లకు చేరిన సమీకరణ

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరం (2025) పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నాటికి 101 పెద్ద కంపెనీలు, 254 చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎస్‌ఎంఈ) ఐపీఓల జారీ ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.85 లక్షల కోట్లు సమీకరించాయి. గత ఏడాది (2024) అన్ని కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన రూ.1.6 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రూ.24,000 కోట్లు ఎక్కువ. ఈ ఏడాది ఐపీఓల ద్వారా కంపెనీలు సమీకరించిన రూ.1.85 లక్షల కోట్లలో పెద్ద కంపెనీల వాటానే అత్యధికంగా రూ.1.74 లక్షల కోట్ల వరకు ఉంది. భారత ప్రైమరీ మార్కెట్‌ చరిత్రలో ఈ సంవత్సరం అత్యంత ప్రధాన ఘట్టమని ప్రైమ్‌ డేటాబేస్‌ గ్రూప్‌ ఎండీ ప్రణవ్‌ హల్డియా తెలిపారు.

ఆగని జోరు: సెకండరీ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నా ప్రైమరీ మార్కెట్‌ గత ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా రేసు గుర్రంలా పరిగెత్తింది. ఐపీఓలకు వచ్చిన పెద్ద కంపెనీల సంఖ్యా వంద దాటింది. దీన్ని మన ప్రైమరీ మార్కెట్లో చోటు చేసుకున్న పెద్ద సంస్థాగత మార్పుగా పరిశీలకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా అనేక ఆటుపోట్లు చోటు చేసుకుంటున్నా, ఐపీఓ మార్కెట్‌ ఇలా శివాలెత్తడం విశేషం. ఈ సంవత్సరం ఐపీఓలకు వచ్చిన దిగ్గజాల్లో టాటా క్యాపిటల్‌, ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌ ఇండియా, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ, లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్స్‌, గ్రో, ఎన్‌ఎ్‌సడీఎల్‌, పైన్‌ ల్యాబ్స్‌, మీషో, ఫిజిక్స్‌వాలా, కెనరా హెచ్‌ఎ్‌సబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రధానమైనవి.

గుణపాఠాలు: ఈ సంవత్సరం ప్రైమరీ మార్కెట్‌ మదుపరులకు కొన్ని గుణపాఠాలు కూడా నేర్పింది. అవేంటంటే, ఒక కంపెనీ ఐపీఓ రిటైల్‌ విభాగం అద్భుతంగా సబ్‌స్ర్కైబ్‌ అయినంత మాత్రాన ఆ ఇష్యూ లాభాలతో లిస్ట్‌ కాదని దాదాపు 29 కంపెనీల ఐపీఓలు నిరూపించాయి. జేఎ్‌సడబ్ల్యూ సిమెంట్‌, డాక్టర్‌ అగర్వాల్‌ హెల్త్‌కేర్‌, ఏథర్‌ ఎనర్జీ, వియ్‌వర్క్‌ ఇండియా, ఓర్క్‌లా ఇండియా, ఫ్యుజియమా పవర్‌ సిస్టమ్స్‌ ఐపీఓలే ఇందుకు ఉదాహరణ. లిస్టింగ్‌ తర్వాత కొద్ది రోజుల పాటు మురిపించినా కొన్ని కంపెనీల షేర్లు మదుపరులను నిండా ముంచాయి. ప్రమోటర్లతో కుమ్మక్కై మర్చంట్‌ బ్యాంకర్లు అధిక ధరలు నిర్ణయించడం ఇందుకు ప్రధాన కారణం.

ఓఎ్‌ఫఎ్‌సలే ఎక్కువ: ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్‌ ద్వారా మదుపరుల కంటే కంపెనీల ప్రమోటర్లు, ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలే ఎక్కువగా లాభపడ్డాయి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎ్‌స)ల ద్వారా తమ పెట్టుబడులను మంచి లాభాలకు ఇన్వెస్టర్లకు అంటగట్టి చక్కగా సొమ్ము చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీలు జారీ చేసిన ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తంలో 60 శాతానికిపైగా వీరి జేబుల్లోకే పోయిందంటే ఈ దందా ఎంత తీవ్ర స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఓ జారీకి ముందే కొన్ని కంపెనీలు గ్రే మార్కెట్లో భారీ ప్రీమియంలతో మదుపరులను ఆకట్టుకుని మరీ వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

Updated Date - Dec 22 , 2025 | 04:26 AM