Share News

Infosys: ఇన్ఫీ లాభం రూ.7,364 కోట్లు

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:02 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 26 సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి క్యూ2 దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.7,364 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది...

Infosys: ఇన్ఫీ లాభం రూ.7,364 కోట్లు

  • క్యూ2లో 13 శాతం వృద్ధి నమోదు

  • వార్షికాదాయ అంచనా 2-3 శాతం జూఒక్కో షేరుకు రూ.23 డివిడెండ్‌

.న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.7,364 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో ఇదే కాలానికి గడించిన రూ.6,506 కోట్ల లాభంతో పోలిస్తే 13.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ క్యూ2లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8.6 శాతం పెరిగి రూ.44,490 కోట్లకు చేరింది. 2024-25 క్యూ2లో రెవెన్యూ రూ.40,986 కోట్లుగా ఉంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయం వృద్ధి అంచనా శ్రేణిని జూన్‌ త్రైమాసికంలో(క్యూ1)లో ప్రకటించిన 1-3 శాతం నుంచి 2-3 శాతానికి మెరుగుపరిచింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.23 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. క్యూ2 ఆదాయంలో ఆర్థిక సేవల విభాగం వాటా 5.6 శాతం పెరిగి 27.7 శాతానికి చేరుకుంది. మాన్యుఫాక్చరింగ్‌ విభాగ వాటా 16.5 శాతంగా నమోదైంది. ఎనర్జీ, యుటిలిటీస్‌, రిసోర్సెస్‌ అండ్‌ సర్వీసెస్‌ విభాగ వాటా 13.4 శాతంగా, రిటైల్‌ 12.7 శాతం, కమ్యూనికేషన్స్‌ విభాగ వాటా 12.1 శాతంగా ఉంది. ఈ జూన్‌ 30 నాటికి కంపెనీలో మొత్తం 3,23,788 మంది ఉద్యోగులుండగా.. ఈ సెప్టెంబరు 30 నాటికి 8,203 పెరుగుదలతో 3,31,991కి పెరిగింది. క్యూ2లో ఉద్యోగుల వలసల రేటు 14.3 శాతానికి తగ్గింది.


12,000 మంది ఫ్రెషర్ల నియామకం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధంలో 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు ఇన్ఫోసిస్‌ సీఎ్‌ఫఓ జయేశ్‌ సంఘ్రజ్క తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రణాళికకు అనుగుణంగా 20,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోనున్నట్లు ఆయన చెప్పారు.

హెచ్‌1బీ వీసాల అవసరం చాలా తక్కువే..

  • అమెరికాలోని మా కార్యాలయాల్లో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్‌ మద్దతు అవసరం లేదు. వీసా స్పాన్సర్‌షిప్‌ అవసరమైన వారు చాలా తక్కువ మందేనని ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు.

  • అనిశ్చిత వాతావరణం ఇంకా కొనసాగుతోంది. సాధారణంగా ఐటీ రంగంలో ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో వ్యాపారం నెమ్మదిస్తుంది. అయితే, కొత్త డీల్స్‌ చురుకుగా జరుగుతున్న నేపథ్యంలో వార్షికాదాయ అంచనా దిగువ శ్రేణిని 2 శాతానికి పెంచాం. ఈ అంచనాను అందుకుంటామని పూర్తి ధీమాతో ఉన్నాం.

- సలీల్‌ పరేఖ్‌, ఎండీ, సీఈఓ, ఇన్ఫోసిస్‌

Updated Date - Oct 17 , 2025 | 04:02 AM