Share News

GDP Growth: జీడీపీ హుషారు.. రూపాయి బేజారు

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:04 AM

భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో క్యూ1 అంచనాల ను మించి 7.8% వృద్ధి రేటును నమోదు చేసింది. తొలి త్రైమాసికానికి ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించిన అంచనా 6.5% కన్నా ఇది చాలా అధికం..

GDP Growth: జీడీపీ హుషారు.. రూపాయి బేజారు

  • జూన్‌ త్రైమాసిక వృద్ది 7.8%

  • అంచనాలను మించి పరుగు

  • జీవితకాల కనిష్ఠానికి రూపాయి

  • ఒక్క రోజులో 51 పైసలు డౌన్‌

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో (క్యూ1) అంచనాల ను మించి 7.8% వృద్ధి రేటును నమోదు చేసింది. తొలి త్రైమాసికానికి ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించిన అంచనా 6.5ు కన్నా ఇది చాలా అధికం. ఇది ఐదు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి. ఆ రకంగా ప్రపంచంలో త్వరితగతిన వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్‌ నిలబెట్టుకుంది. గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన వృద్ధి రేటు 8.4ు తర్వాత నమోదైన గరిష్ఠ స్థాయి ఇదే. కాగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు 5.2 శాతానికే పరిమితం అయింది. అయితే ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలు అమలులోకి రాక ముందు పరిస్థితి. ఇప్పుడు భారత ఉత్పత్తులపై 50ు సుంకాలు అమలులోకి రావడంతో టెక్స్‌టైల్స్‌ సహా కీలక ఎగుమతి రంగాలు డీలా పడి వృద్ధి అంచనాలను తలకిందులు చేయవచ్చని పరిశీలకులంటున్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగం క్యూ1లో బలమైన వృద్ధి రేటు నమోదు కావడానికి ఊతం ఇచ్చింది. అలాగే వాణిజ్యం, హోటళ్లు, ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు సహా సేవల రంగం కూడా ఈ వృద్ధికి బాసటగా నిలిచింది. ఎన్‌ఎ్‌సఓ గణాంకాల్లోని ప్రధానాంశాలు...

  • వ్యవసాయ రంగం క్యూ1లో 3.7ు వృద్ధి రేటు నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ రంగం వృద్ధి రేటు 1.5 శాతంగా ఉంది. తయారీ రంగం వృద్ధి మాత్రం మందకొడిగా ఉంది. ఈ రంగం వృద్ధి రేటు 7.6% నుంచి 7.7 శాతానికి పెరిగింది.

  • స్థిర ధరల్లో ఆర్థిక వ్యవస్థ విలువ గత ఏడాది క్యూ1తో పోల్చితే రూ.44.41 లక్షల కోట్ల నుంచి రూ.47.89 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 7.8 శాతంతో సమానం.

  • ప్రస్తుత ధరల ప్రకారం ఆర్థిక వ్యవస్థ విలువ రూ.రూ.86.05 లక్షల కోట్లుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.79.08 లక్షల కోట్లతో పోల్చితే వృద్ధిరేటు 8.8 శాతంగా ఉంది.

  • ప్రభుత్వ తుది వినియోగ వ్యయం బలమైన పునరుజ్జీవంతో 4ు నుంచి 9.7 శాతానికి పెరిగింది. రిటైల్‌ ప్రైవేట్‌ తుది వినియోగ వ్యయం మాత్రం 8.3ు నుంచి 7 శాతానికి దిగజారింది. స్థిర ధరల ప్రకారం స్థూల స్థిర పెట్టుబడులు 6.7ు నుంచి 7.8 శాతానికి పెరిగాయి.

  • విభిన్న విధానాల ద్వారా జీడీపి మదింపులో ఏర్పడిన వ్యత్యాసం రూ.33,384 కోట్ల నుంచి రూ.1.11 లక్షల కోట్లకు పెరిగింది.


పాతాళానికి రూపాయి

ట్రంప్‌ సుంకాల ప్రభావం ఫారెక్స్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. శుక్రవారం అమెరికా డాలర్‌ మారకంలో రూపాయి తొలిసారిగా 88 కన్నా దిగజారింది. శుక్రవారం ఉదయం 87.73 వద్ద ప్రారంభమైన రూపాయి త్వరితగతిన దిగజారుతూ ఒక దశలో 88.33 వరకు కూడా పడిపోయింది. చివరికి నష్టాన్ని 51 పైసలకు పరిమితం చేసుకుని 88.09 వద్ద ముగిసింది. ఈ రెండూ జీవితకాల కనిష్ఠ స్థాయిలే. కాగా గురువారం నాడు రూపాయి 11 పైసలు నష్టపోయి 87.58 వద్ద ముగిసింది.

విదేశీ నిధుల తరలింపే కారణం: ట్రంప్‌ సుంకాల అమలు అనంతరం భారత మార్కెట్‌ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారీ ఎత్తున నిధులు తరలించుకుపోతున్నారు. ఎఫ్‌పీఐలు శుక్రవారం ఒక్క రోజులోనే రూ.8,312.66 కోట్లు తరలించుకుపోయారు. గురువారం రూ,3,856.51 కోట్ల విలువ గల ఈక్విటీలు విక్రయించారు. ఒకపక్క విదేశీ నిధులు భారీగా తరలిపోవడంతో పాటు మరోపక్క భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఏర్పడిన ఉద్రిక్తతలతో దేశీయ కరెన్సీ తీవ్ర ఒత్తిడికి లోనవుతోందని ఫారెక్స్‌ ట్రేడర్లంటున్నారు.

ఫారెక్స్‌ నిల్వలు డౌన్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ నెల 22వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 438.6 కోట్ల డాలర్లు దిగజారి 69,072 కోట్ల డాలర్లకు తగ్గాయి. అమెరికా సుంకాల ప్రభావం వల్ల వృద్ధి రేటు క్షీణించే ముప్పు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.3ు-6.8ు మధ్యన ఉండవచ్చు. దేశీయ డిమాండు బలంగా ఉండడం ఇందుకు కారణం. జీడీపీపై సుంకాల ప్రభావం తాత్కాలికంగానే ఉంటుంది. జీఎ్‌సటీ రేట్ల సరవణకు కసరత్తు జరుగుతూ ఉండడం, పండగల డిమాండు వృద్ధికి ఊతం ఇచ్చే అంశాలు.

- అనంత నాగేశ్వరన్‌,

ప్రధాన ఆర్థిక సలహాదారు

Updated Date - Aug 30 , 2025 | 04:05 AM