GDP Growth: భళా భారత్..
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:08 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటు నేపథ్యంలోనూ భారత ప్రగతి చక్రం అంచనాలను మించిన పరుగుతో అందరినీ అబ్బుర పరిచింది...
6 త్రైమాసికాల గరిష్ఠానికి దేశ జీడీపీ వృద్ధి రేటు
సెప్టెంబరు త్రైమాసికంలో 8.2 శాతంగా నమోదు
అమెరికా సుంకాల నేపథ్యంలోనూ అంచనాలను మించిన ఆర్థిక ప్రగతి
తయారీ, సేవల రంగాల జోరు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటు నేపథ్యంలోనూ భారత ప్రగతి చక్రం అంచనాలను మించిన పరుగుతో అందరినీ అబ్బుర పరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో జీడీపీ వృద్ధి రేటు ఆరు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 8.2 శాతానికి ఎగబాకింది. జీఎ స్‌టీ రేట్ల తగ్గుదలతో వినియోగం భారీగా పుంజుకోవచ్చన్న అంచనాలతో దేశంలో వస్తు తయారీ జోరందుకోవడంతో పాటు సేవల రంగమూ అద్భుత పనితీరును కనబరచడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. ఈ క్యూ2లో ప్రస్తుత ధరల ఆధారిత లేదా నామినల్ జీడీపీ 8.7 శాతానికి చేరుకుంది. అమెరికా మనపై సుంకాల భారాన్ని ఈ ఆగస్టులో 50 శాతానికి పెంచిన తరుణంలోనూ ఈ స్థాయు వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కాగా.. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో 5.6 శాతంగా ఉంది. కాగా, గత గరిష్ఠమైన 8.4 శాతం వృద్ధి రేటు 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో నమోదైంది.
శరవేగ భారత్
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మరోసారి తన అగ్ర కిరీటాన్ని నిలబెట్టుకుంది. ఈ జూలై-సెప్టెంబరు కాలానికి చైనా జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితమైంది. చైనాను మించిన వృద్ధిని సాధిస్తుండటంతో పాటు భారత్ ప్రపంచ ఆర్థిక వృద్ధికీ ప్రధాన చోదకంగా మారింది.
ప్రథమార్ధం వృద్ధి రేటు 8 శాతం
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి (ఏప్రిల్-సెప్టెంబరు) జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి వృద్ధి రేటు 6.1 శాతంగా ఉంది. ఈ ప్రథమార్ధం ట్రెండ్‌ను బట్టి చూస్తే, పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు ఆర్థిక సర్వే నివేదికలో అంచనా వేసిన 6.3-6.8 శాతాన్ని మించిపోయే అవకాశాలున్నాయి.
సంస్కరణలు కొనసాగిస్తాం
క్యూ2లో 8.2 శాతం వృద్ధి రేటు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వృద్ధి సానుకూల విధానాలు, సంస్కరణల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ప్రజల కష్టాన్ని, వ్యాపారతత్పరతకూ ప్రతిబింబమిది. మా ప్రభుత్వం సంస్కరణలను కొనసాగించడంతో పాటు ప్రజల జీవనాన్ని మరింత సులభతరం చేసే దిశగా కృషి చేస్తుంది.
- నరేంద్ర మోదీ, ప్రధాని
ఆర్థికం జోరుకు నిదర్శనం
తాజా వృద్ధి గణాంకాలు బలమైన ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థ జోరును కనబరుస్తున్నాయి. ఆర్థిక స్థిరీకరణ, లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ పెట్టుబడులు, పలు సంస్కరణలు దేశంలో పారిశ్రామికోత్పత్తిని పెంచడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేశాయి.
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
4 లక్షల కోట్ల డాలర్లకు ఎకానమీ
వృద్ధి నమోదైన నేపథ్యంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7 శాతం లేదా ఆపై స్థాయికి చేరవచ్చు. ప్రస్తుత వృద్ధి ట్రెండ్‌ను బట్టి చూస్తే, భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఈ ఆర్థిక సంవత్సరంలోనే 4 లక్షల కోట్ల డాలర్లు దాటిపోవచ్చు. ఈ మార్చి నాటికే భారత ఎకానమీ 3.9 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంది.
- వీ అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు