Indian Rupee: ఇంట్రాడేలో రూ.90కి డాలర్-రూపీ మారకం
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:34 AM
దేశీయ కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 47 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.90 మైలురాయికి చేరింది.
డాలర్ @ 90
సరికొత్త జీవితకాల కనిష్ఠానికి కరెన్సీ విలువ
43 పైసల నష్టంతో రూ.89.96 వద్ద ముగింపు
ముంబై: దేశీయ కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 47 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.90 మైలురాయికి చేరింది. చివరికి 43 పైసల నష్టంతో రూ.89.96 వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్ కనిష్ఠ ముగింపు కూడా. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, దిగుమతిదారుల నుంచి అమెరికన్ కరెన్సీకి డిమాండ్ పెరగడం, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, స్పెక్యులేషన్ ట్రేడర్ల షార్ట్ కవరింగ్ మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యమవుతుండటం, వాణిజ్య లోటు ఆందోళనలు కూడా ఇందుకు మరో కారణమని వారన్నారు. ఈ ఏడాదిలో రూపాయి విలువ 5 శాతం మేర క్షీణించింది. ఆసియాలోకెల్లా అత్యధికంగా నష్టపోయిన కరెన్సీ మనదే.
మున్ముందు మరింత క్షీణత
‘‘డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటుకు రూ.90 ప్రధాన నిరోధక స్థాయిగా ఉండనుంది. ఒకవేళ ఈ స్థాయిని కూడా అధిగమిస్తే, ఎక్స్ఛేంజ్ రేటు రూ.91 లేదా ఆపై దిశగా పయనించవచ్చ’’ని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ విభాగ అధిపతి అనింద్య బెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరుణంలో రూపాయిని ఆదుకునేందుకు ఫారెక్స్ కార్యకలపాల్లో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలని, లేదంటే కరెన్సీ విలువ మరింత పతనం కావచ్చని, అది మారకం విలువలో తీవ్ర హెచ్చుతగ్గులకు కూడా దారితీయవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, ఫెడ్ రేట్ల తగ్గింపు అవకాశాలు, ఆర్‌బీఐ జోక్యంతో రూపాయికి మద్దతు లభించవచ్చని, మున్ముందు సెషన్లలో డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటు రూ.89.60-90.20 శ్రేణిలో కదలాడవచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అన్నారు.
78 ఏళ్ల స్వతంత్ర భారతంలో రూ.3.30 నుంచి రూ.90 వరకు..
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన ఏడాది (1947)లో రూ.3.3గా ఉన్న డాలర్-రూపాయి మారకం విలువ.. 1990 దశకం వరకు చాలా నెమ్మదిగానే తగ్గుతూ వచ్చింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో (1991) తొలి తరం ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పటి నుంచి రూపాయి విలువ వేగంగా కరుగుతూ వచ్చింది. నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014లో రూ.62 స్థాయిలో ఉన్న రూపా యి మారకం విలువ.. గడిచిన 11 ఏళ్లలో మరింత వేగంగా క్షీణిస్తూ వచ్చింది. ఏటేటా పెరుగుతూ వస్తున్న వాణిజ్య లోటు, ముడి చమురు, పసిడి సహా పలు దిగుమతులపై ఆధారం పెరగడం, అధిక ధరలు వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి.