అమ్మకాల ఒత్తిడితో కుంగిన మార్కెట్
ABN , Publish Date - May 23 , 2025 | 04:33 AM
అమెరికా, జపాన్ దేశాల బాండ్లపై రాబడులు పెరిగిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవి చూశాయి. రిస్క్ తీసుకోవడానికి ...
ముంబై: అమెరికా, జపాన్ దేశాల బాండ్లపై రాబడులు పెరిగిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవి చూశాయి. రిస్క్ తీసుకోవడానికి విముఖత ప్రదర్శించిన ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలు సాగించారు. ఐటీ, ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల జోరుతో సెన్సెక్స్ 644.64 పాయింట్ల నష్టంతో 80,951.99 వద్ద ముగిసింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, అల్ర్టాటెక్ సిమెంట్ షేర్లు మినహా సెన్సెక్స్‌లోని 27 కంపెనీల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1106.71 పాయింట్లు నష్టపోయి 80,489.92 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 203.75 పాయింట్ల నష్టంతో 24,609.70 వద్ద ముగిసింది. అమెరికన్ బాండ్లపై రాబడులు 5% స్థాయిని, జపాన్ బాండ్లపై రాబడులు 3.5% స్థాయిని దాటడంతో రిస్క్‌తో ముడిపడి ఉన్న షేర్లను ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో విక్రయించడం ప్రపంచ మార్కెట్లన్నింటినీ కుంగదీసిందని విశ్లేషకులంటున్నారు.
బ్లూవాటర్ లాజిస్టిక్స్ ఇష్యూ ధర రూ.132-135: హైదరాబాద్‌కు చెందిన బ్లూవాటర్ లాజిస్టిక్స్ లిమిటెడ్ ఇష్యూ వచ్చే మంగళవారం ప్రారంభం కాబోతోంది. షేర్ల ధర శ్రేణిని కంపెనీ రూ.132-135గా ప్రకటించింది. ఇష్యూ ద్వారా రూ.40.50 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యంగా తెలిపింది. షేర్లను ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్ ప్లాట్‌ఫారంపై లిస్టింగ్ చేస్తారు. ఇష్యూ గురువారం ముగుస్తుంది. ఒక్కోటి రూ.10 ముఖవిలువ గల 30 లక్షల ఈక్విటీ షేర్లను బుక్ బిల్డింగ్ విధానంలో విడుదల చేస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 10.10 లక్షల ఈక్విటీ షేర్లను రిజర్వ్ చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..