భారతీయ ఫిలిం మేకర్ స్క్రీన్ అకాడెమీ ప్రారంభం
ABN , Publish Date - Jul 11 , 2025 | 10:32 PM
భారతీయ సినిమా రంగంలో వర్ధమాన ఫిలిం మేకర్‌లకు ప్రోత్సహించేందుకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, స్క్రీన్ కలిసి స్క్రీన్ అకాడెమీని ప్రారంభించాయి.
ముంబై: భారతీయ సినిమా రంగంలో వర్ధమాన ఫిలిం మేకర్‌లకు ప్రోత్సహించేందుకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, స్క్రీన్ కలిసి స్క్రీన్ అకాడెమీని ప్రారంభించాయి. లోధా ఫౌండేషన్ అభిషేక్ లోధా ఈ అకాడెమీకి మద్దతు అందించారు. ఎఫ్‌టీఐఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఫెలోషిప్‌లు అందిస్తుంది. గునీత్ మోంగా, పాయల్ కపాడియా, రసూల్ పోకుట్టి వంటి సినీ ప్రముఖులు విద్యార్థులకు మాస్టర్‌క్లాస్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందిస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీని ఏర్పాటును స్వాగతించారు. "స్క్రీన్ అకాడెమీతో భారతీయ సినీ పరిశ్రమకు గణనీయ ప్రయోజనం కలుగుతుంది" అని ఫడ్నవీస్ తెలిపారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా మాట్లాడుతూ.. "ప్రతిభావంతులకు ఆర్థికంగా, అన్ని విధాలుగా తోడ్పాటు అందించగలిగే వ్యవస్థను నిర్మిస్తున్నాం" అని పేర్కొన్నారు.
పర్యావరణహిత రవాణాకు మోంట్రా ఎలక్ట్రిక్, గ్రీన్ డ్రైవ్ భాగస్వామ్యం
ఢిల్లీ: భారత్‌లో పర్యావరణహిత లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించే దిశగా మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ గ్రీన్ డ్రైవ్ మొబిలిటీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. సున్నా ఉద్గారాలు వెలువరించే, కర్బన రహిత మొబిలిటీ సొల్యూషన్స్ అందించడం ఈ భాగస్వామ్య లక్ష్యం. దీనిలో భాగంగా, మోంట్రా ఎలక్ట్రిక్ వచ్చే మూడు నెలల్లో 50 EVIATOR ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వాహనాలను (ఈ-ఎస్‌సీవీ) వినియోగంలోకి తెస్తుంది. ఇది గ్రీన్ డ్రైవ్ విస్తరణకు తోడ్పడుతుంది. మోంట్రా ఎలక్ట్రిక్ ఈ-ఎస్‌సీవీ విభాగం సీఈఓ సజు నాయర్, గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ ఫౌండర్, సీఈఓ హరి కృష్ణ ఒప్పందంపై సంతకాలు చేశారు. EVIATOR అధిక లోడ్ మోసే సామర్థ్యం, స్మార్ట్ టెక్ ఫీచర్లు, శక్తి ఆదా సామర్థ్యాలు కలిగి ఉంది. ఇది సున్నా ఉద్గారాల లాజిస్టిక్స్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ఈ వాహనాల వినియోగం గ్రీన్ డ్రైవ్ టెక్ ఆధారిత ఫ్లీట్ నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన అలైడ్ ఇంజినీరింగ్
స్మార్ట్ మీటరింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన టెక్ ఆధారిత సొల్యూషన్స్ అందించే అలైడ్ ఇంజినీరింగ్ వర్క్స్ లిమిటెడ్ (అలైడ్ ఇంజినీరింగ్) సంస్థ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తమ ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని సమర్పించింది. ఐపీవో కింద షేర్లను విక్రయించడం ద్వారా నిధులను సమీకరించుకోవాలని కంపెనీ భావిస్తోంది.ఇందులో భాగంగా రూ. 400 కోట్ల వరకు విలువ చేసే షేర్లు తాజాగా జారీ అవుతాయి.