Share News

జూలై 8 నాటికి భారత్‌ యూఎస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం

ABN , Publish Date - May 22 , 2025 | 05:43 AM

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం భారత్‌-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరాయి. దీంతో జూలై 8వ తేదీ లోపే రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశం...

జూలై 8 నాటికి భారత్‌ యూఎస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం

తుది దశకు చేరిన చర్చలు

బెట్టు సడలిస్తున్న రెండు దేశాలు

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం భారత్‌-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరాయి. దీంతో జూలై 8వ తేదీ లోపే రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి. ఈ ఒప్పందం కుదిరితే జూలై 9 నుంచి భారత ఎగుమతులపై అమల్లోకి వచ్చే 26 శాతం సుంకాల బెడద తప్పుతుంది. గత నెల 2న విధించిన ఈ సుంకాల అమలును ట్రంప్‌ సర్కారు జూలై 9 వరకు పక్కనపెట్టింది. దీంతో ఈలోపే బీటీఏకి సంబంధించి ఏదో రూపంలో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్‌ యోచిస్తోంది. ఆ తర్వాత సెప్టెంబరు లేదా అక్టోబరు నాటికి బీటీఏపై తుది ఒప్పందానికి రావాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.


బెట్టు సడలింపు !

ఈ తాత్కాలిక ఒప్పందం కోసం రెండు దేశాలు మెట్టు దిగుతున్నట్టు సమాచారం. అమెరికా తన దిగుమతులపై విధించిన 26 శాతం సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే, ఆ దేశ వ్యవసాయ, పాల ఉత్పత్తులు, ఆటోమొబైల్స్‌ ముఖ్యం గా విద్యుత్‌ వాహనాల (ఈవీ) దిగుమతులను కనీస దిగుమతి ధర (ఎంఐపీ)తో కోటా పద్దతిలో అనుమతించేందుకు భారత్‌ సిద్ధమైనట్టు తెలుస్తోంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే టెక్స్‌టైల్స్‌, తోలు వస్తువులు, రొయ్యలు, ప్లాస్టిక్‌ వస్తువులు, రసాయనాలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి పండ్లు, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, ఫార్మా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు ప్రతిగా తన పారిశ్రామిక వస్తువులు, వైన్స్‌, పెట్రో కెమికల్‌ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, యాపిల్స్‌, జన్యుమార్పిడితో పండించిన సొయా, మొక్కజొన్న దిగుమతులపై భారత్‌ మరింత ఉదారంగా వ్యవహరించాలని అమెరికా కోరుతోంది. ఈ సమస్యలను అధిగమిస్తే జూలై 8లోగా రెండు దేశాల మధ్య తాత్కాలిక బీటీఏ సాధ్యమేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి.


అదే బాటలో

ఈయూ

స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం భారత్‌-యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మధ్య జరుగుతున్న చర్చలూ ఊపందుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈయూతోనూ ఈ ఏడాది జూలైలోగా తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపాయి. ఇందుకోసం ఒక ఉన్నతాధికార బృందం ఈ వారం ఈయూ కేంద్రమైన బ్రస్సెల్స్‌ వెళ్లనుంది. తమ దేశాల నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్స్‌, వైద్య పరికరాలు, మద్యం, మాంసం, పౌలీ్ట్ర దిగుమతులపై భారత్‌ సుంకాలను పూర్తిగా ఎత్తివేయడం లేదా గణనీయంగా తగ్గించాలని ఈయూ కోరుతోంది. దీనికి తోడు తమ కంపెనీలు భారత్‌లో అమ్మే వస్తువుల మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్‌)ను సంరక్షించాలని కోరుతోంది. అందుకు ప్రతిగా భారత్‌ నుంచి ఎగుమతయ్యే రెడీమేడ్‌ దుస్తులు, ఔషధాలు, స్టీలు, పెట్రో ఉత్పత్తులు, విద్యుత్‌ మెషినరీపై సుంకాలు కనీస స్థాయికి తగ్గించేందుకు లేదా పూర్తిగా ఎత్తివేసేందుకు ఈయూ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం కుదిరితే ఈయూలోని 27 దేశాలకు భారత ఎగుమతులు గణనీయంగా పెరగనున్నాయి.

ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 05:43 AM