Share News

Jyotiraditya Scindia: రూ.900 కోట్లతో జాతీయ శాట్‌కామ్‌ పర్యవేక్షణ కేంద్రం

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:19 AM

దేశంలోని డేటా వనరులు, స్పెక్ట్రమ్‌ ఆస్తులను పరిరక్షించేందుకు దాదాపు రూ.900 కోట్లతో జాతీయ శాట్‌కామ్‌ పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు...

Jyotiraditya Scindia: రూ.900 కోట్లతో జాతీయ శాట్‌కామ్‌ పర్యవేక్షణ కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలోని డేటా వనరులు, స్పెక్ట్రమ్‌ ఆస్తులను పరిరక్షించేందుకు దాదాపు రూ.900 కోట్లతో జాతీయ శాట్‌కామ్‌ పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం వెల్లడించారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) సదస్సులో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ అంశంపై జరిగిన సెషన్‌లో మాట్లాడుతూ టెలికం, బ్రాడ్‌కాస్టింగ్‌తో కూడిన దేశీయ శాట్‌కామ్‌ మార్కెట్‌ గత ఏడాది 430 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుందన్నారు. 2033 నాటికి దాదాపు 1,500 కోట్ల డాలర్ల స్థాయికి పెరగవచ్చన్నారు. దేశంలో శాటిలైట్‌ ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రైవేట్‌ రంగంలోని మూడు సంస్థ లు యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌, జియో ఎస్‌జీఎ్‌సకు లైసెన్సు లు మంజూరు చేసింది. ఈ మూడు సంస్థలు శాట్‌కామ్‌ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కోసం ఎదురు చూస్తున్నాయి.

వేగంగా శాట్‌కామ్‌ సేవల విస్తరణ

భారత టెలికం సంస్థలు ఇప్పటివరకు 4.8 లక్షల టవర్ల ఏర్పాటు ద్వారా దేశంలోని 99.9 శాతం జనాభాకు 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చాయని సింధియా అన్నారు. ‘‘ఇక శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవల్లోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా శాటిలైట్‌ సేవలు విస్తరించడమే కాకుండా మానవాళికి శాట్‌కామ్‌ అవసరాన్ని పునర్‌నిర్వచిస్తాం. ఇంతక్రితం 5జీతో ఇదే చేశాం. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా వేగంగా 20 నెలల్లోనే 5జీ సేవలను విస్తరింపజేశాం. శాట్‌కామ్‌ విషయంలోనూ ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తామని హామీ ఇస్తున్నా’’ అని మంత్రి పేర్కొన్నారు.


6జీలో 10 శాతం పేటెంట్ల లక్ష్యం

భారత్‌ ఆశయాలు 5జీని దాటి 6జీ, శాట్‌కామ్‌కు విస్తరించి ఉన్నాయని సింధియా అన్నారు. 6జీ సాంకేతికతలో 10 శాతం పేటెంట్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో శాట్‌కామ్‌ సేవలు విశేషంగా వృద్ధి చెందనున్నాయని, 2033 నాటికి ఈ మార్కెట్‌ మూడింతలు కావచ్చన్నారు.

భారత్‌లో శాట్‌కామ్‌ సేవలపై ప్రజల అంచనాలు పెరుగుతున్న తరుణంలో యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ ద్వారా శాట్‌కామ్‌ సేవలను ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.

- సునీల్‌ మిట్టల్‌,

భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌

సెమీకండక్టర్ల నుంచి ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌ వరకు, త్వరలో రాబోతున్న 6జీలో భారత్‌ పురోగతిని ఐఎంసీలో ప్రదర్శించిన పూర్తి స్థాయి సాంకేతికతలు నొక్కి చెబుతున్నాయి. డిజిటల్‌ విప్లవంలో భారత్‌ను అగ్రస్థానంలో ఉంచడంతో పాటు నవ ఆవిష్కరణలకు మా కంపెనీ కట్టుబడి ఉంది.

- ఆకాశ్‌ అంబానీ, రిలయన్స్‌ జియో చైర్మన్‌

భారతీయులకు భద్రమైన, ఆమోదనీయమైన, అత్యంత నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్‌ అనుభూతిని పంచేందుకు సంసిద్ధంగా ఉన్నాం.

- పర్ణిల్‌ ఉర్ధ్వరేశే, స్టార్‌లింక్‌ ఇండియా ప్రతినిధి

టెలికం శాఖ అభివృద్ధి చేసిన ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌ ప్లాట్‌ఫామ్‌ సహాయంతో ఫోన్‌పే, పేటీఎం వంటి పేమెంట్‌ యాప్‌ లు రూ.200 కోట్ల వరకు ఆర్థిక మోసాలను అరికట్టగలిగాయి.

- రాహుల్‌ చారి, ఫోన్‌పే సహ-వ్యవస్థాపకుడు

Updated Date - Oct 09 , 2025 | 03:19 AM