Mid Market 2025: మిడ్ మార్కెట్ జీసీసీ హబ్‌గా భారత్
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:31 AM
భారత్ మిడ్ మార్కెట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు కేంద్రంగా మారుతుందని నాస్కామ్-జిన్నోవ్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో జీసీసీ హబ్‌ల ఏర్పాటుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలపైనే దృష్టి
నాస్కామ్-జిన్నోవ్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్ క్రమంగా మిడ్ మార్కెట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)కు కేంద్రంగా మారుతోంది. ప్రస్తుతం మన దేశంలోని వివిధ నగరాల్లో 480కు పైగా మిడ్ మార్కెట్ జీసీసీలు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఏర్పాటైన జీసీసీల్లో ఇవి నాలుగో వంతని నాస్కామ్-జిన్నోవ్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ‘ఇది చాలా పెద్ద మార్కెట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్షిక టర్నోవర్ 10 కోట్ల డాలర్ల నుంచి 100 కోట్ల డాలర్ల వరకు ఉన్న మిడ్ మార్కెట్ కంపెనీలు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో 30,000 నుంచి 40,000 కంపెనీలు జీసీసీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది భారత్‌కు మంచి అవకాశం’ అని ఆ నివేదిక పేర్కొంది.
కీలక కేంద్రాలుగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై: మధ్య రకం కంపెనీల్లో ఎక్కువ కంపెనీలు తమ జీసీసీలను బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్)గా అందించే కంపెనీలు, ప్రొడక్ట్ ఆధారిత మిడ్ సైజ్ కంపెనీలు తమ జీసీసీల ఏర్పాటుకు బెంగళూరుపై మొగ్గు చూపుతున్నాయి. డిజిటల్, ఇంజనీరింగ్ రంగాలకు చెందిన మిడ్ మార్కెట్ కంపెనీల జీసీసీలకు హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా మారుతున్నాయి. మౌలిక సదుపాయాలు, స్థానిక ప్రభుత్వాల ప్రోత్సా హం, నిపుణులైన ఉద్యోగుల అందుబాటూ ఇందుకు తోడవుతున్నాయి.