Share News

Income Tax Return: ఐటీ రిటర్న్‌లు ఎవరికి ఏ ఫారం

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:05 AM

ఆదాయాన్ని బట్టి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఫైల్‌ చేయాల్సిన ఐటీ రిటర్న్‌ ఫారాలు మారిపోతుంటాయి. గత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి సంబంధించి (2025-26 అసె్‌సమెంట్‌ ఇయర్‌) ఎవరు ఏ ఐటీఆర్‌ దాఖలు చేయాలనే దానిపై ఐటీ శాఖ...

Income Tax Return: ఐటీ రిటర్న్‌లు ఎవరికి ఏ ఫారం

ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. అందరికీ ఒకే రిటర్న్‌ ఫారం వర్తించదు. ఆయా వ్యక్తుల ఆదాయాల్ని బట్టి ఇది మారుతుంది. దీనికి సంబంధించి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయినా చాలా మందికి ఇప్పటికీ తమ ఆదాయానికి తగ్గట్టు తమ రిటర్న్‌ను ఏ ఫారమ్‌లో దాఖలు చేయాలనే దానిపై స్పష్టత లేదు.

ఆదాయాన్ని బట్టి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఫైల్‌ చేయాల్సిన ఐటీ రిటర్న్‌ ఫారాలు మారిపోతుంటాయి. గత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి సంబంధించి (2025-26 అసె్‌సమెంట్‌ ఇయర్‌) ఎవరు ఏ ఐటీఆర్‌ దాఖలు చేయాలనే దానిపై ఐటీ శాఖ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇందుకోసం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2, ఐటీఆర్‌-3, ఐటీఆర్‌-4 పేరుతో నాలుగు ఫారాలు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన మార్పులకు అనుగుణంగా ఈ ఐటీఆర్‌ ఫారాల్లో అనేక మార్పులూ చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఎవరు ఏ ఐటీఆర్‌ ఫారం ఫైల్‌ చేయాలో తెలుసుకుందాం.


వీరికి తప్పనిసరి

ఆదాయం ఆదాయ పన్ను పరిమితి కంటే తక్కువగా ఉన్నా ఈ కింది వ్యక్తులు తప్పనిసరిగా రిటర్న్‌లు దాఖలు చేయాలి.

  • విదేశీ పర్యటనల్లో ఖర్చులు రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసే వ్యక్తులు

  • వార్షిక కరెంటు బిల్లు రూ.లక్ష మించిన వ్యక్తులు

  • కరెంట్‌ ఖాతాలో రూ.కోటికి మించి డిపాజిట్‌ ఉన్న వ్యక్తులు

  • విదేశాల్లో ఆస్తులు ఉన్న వ్యక్తులు

  • తన పేరు మీద విదేశీ బ్యాంకు ఖాతాలు ఉన్న వ్యక్తులు లేదా లేదా ఎవరి విదేశీ బ్యాంకు ఖాతాకైనా లబ్దిదారుగా ఉన్న వ్యక్తులు

  • సెక్షన్‌ 54, 54బీ, 54ఈసీ, 54ఎఫ్‌ కింద మూలధన లాభాలకు పన్ను మినహాయింపులు కోరే వ్యక్తులు

  • ఆదాయ పన్ను మినహాయింపు కోరే వ్యక్తులు

  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీడీఎ్‌స/టీసీఎ్‌సల మొత్తం రూ.25,000 మించిన వ్యక్తులు. సీనియర్‌ సిటిజన్లయితే రూ.50,000 వరకు


ఐటీఆర్‌-1

గతంలో మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు ఐటీఆర్‌-1లో తమ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. 2025-26 అసె్‌సమెంట్‌ ఇయర్‌ (ఏవై) నుంచి వీరు కూడా ఐటీఆర్‌-1 ద్వారా తమ రిటర్న్‌ ఫైల్‌ చేయవచ్చు. కాకపోతే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. అవేంటంటే...

  • మూలధన లాభాలు దీర్ఘకాలిక లాభాలై ఉండాలి

  • ఆ లాభాలు లిస్టెడ్‌ కంపెనీలు షేర్లు లేదా ఈక్విటీ మ్యూచు వల్‌ ఫండ్ల యూనిట్ల అమ్మకాలపై వచ్చినవై ఉండాలి

  • ఇలా వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలు ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకూడదు

  • దేశంలోనే నివసిస్తున్న సాధారణ పౌరుడై ఉండాలి

  • పన్ను పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం రూ.50 లక్షలు మించకూడదు

  • వడ్డీ, డివిడెండ్లు, పెన్షన్‌ వంటి ఆదాయాలతో పాటు జీతం, ఒక ఇంటిపై వచ్చే ఆదాయాలై ఉండాలి

  • రూ.5,000 మించని వార్షిక వ్యవసాయ ఆదాయం

ఐటీఆర్‌-2

పన్నుల పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్న వ్యక్తులు ఈ ఫారం ద్వారా తమ ఐటీఆర్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయాలి. ఈ ఫారంలో వారు తమ ఆస్తులు, అప్పులు వెల్లడించడం ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. గత ఏడాది జూలై 23కు ముందు లేదా ఆ తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాలు ఆర్జించిన వ్యక్తులు, గత ఏడాది అక్టోబరు తర్వాత షేర్ల బైబ్యాక్‌పై నష్టపోయిన వ్యక్తులు కూడా ఐటీఆర్‌-2ను ఎంచుకోవచ్చు. ఈ కింది అంశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలు పూర్తి చేసిన వ్యక్తులందరూ ఐటీఆర్‌-2 పరిధిలోకి వస్తారు. అవేమిటంటే?

  • అవిభాజ్య హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎ్‌ఫ)

  • వార్షిక మూలధన లాభాలు రూ.1.25 లక్షలకు

    మించిన వ్యక్తులు

  • ఏదైనా కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వ్యక్తులు

  • స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కాని కంపెనీలలో షేర్లు ఉన్న వ్యక్తులు

  • విదేశీ ఆదాయం ఉన్న వ్యక్తులు

క్రిప్టో కరెన్సీలు, ఇతర డిజిటల్‌ ఆస్తుల అమ్మకం, బదిలీల ద్వారా వచ్చిన ఆదాయం ఉన్న వ్యక్తులు


ఐటీఆర్‌-3

వ్యాపార, వృత్తిపరమైన ఆదాయాలు ఉన్న వ్యక్తులు ఐటీఆర్‌-3 ద్వారా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి. ఈ సంవత్సరం క్రూయిజ్‌ నౌకల ద్వారా ఆదాయం వచ్చే వారిని కూడా ఈ ఐటీఆర్‌ పరిధిలో చేర్చారు. ఇందుకోసం ఐటీ చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్‌ 44బీబీసీని ప్రత్యేకంగా చేర్చారు. ఈ కింది వ్యక్తులు ఐటీఆర్‌-3 ద్వారా తమ రిటర్న్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.

  • వ్యాపార, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలు

  • భాగస్వామ్య సంస్థలు

  • ఎఫ్‌ అండ్‌ ఓ లేదా ఇంట్రాడే ట్రేడింగ్‌లో లాభనష్టాలు నమోదు చేసిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు

ఐటీఆర్‌-4

ప్రిజెంప్టివ్‌ ట్యాక్స్‌ స్కీమ్‌ కోసం ఐటీ చట్టంలోని సెక్షన్‌ 44ఏడీ, సెక్షన్‌ 44ఏడీఏలను ఎంచుకున్న వ్యాపార, వృత్తి నిపుణులు ఐటీఆర్‌-4 ద్వారా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయవచ్చు

  • సెక్షన్‌ 44ఏడీ, 44 ఏడీఏ లేదా 44 ఏఈ కింద రూ.50 లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలు, ఎల్‌ఎల్‌పీలు కాని సంస్థలు

  • ఈక్విటీ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల అమ్మకంపై రూ.1.25 లక్షల వరకు మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలు

  • వృత్తి నిపుణులకు వచ్చే ఆదాయంలో 95 శాతానికిపైగా గుర్తింపు పొందిన బ్యాంకింగ్‌ చానల్స్‌ ద్వారా వస్తే వార్షిక ఆదాయం రూ.75 లక్షల వరకు ఉన్నా ఐటీఆర్‌-4 ద్వారా రిటర్న్‌ పైల్‌ చేయవచ్చు

  • డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఇతర వృత్తి నిపుణులు సెక్షన్‌ 44ఏడీఏ పరిఽధిలోకి వస్తారు

  • సెక్షన్‌ 44ఏడీ కింద ప్రిజెంప్టివ్‌ ట్యాక్స్‌ స్కీమ్‌ను ఎంచుకుని రూ.2 కోట్ల వరకు ఆదాయం ఉన్న వ్యాపారులు

  • ఈ వ్యాపార ఆదాయంలో 95 శాతం లేదా అంతకు మించి బ్యాంకింగ్‌ చానల్స్‌ ద్వారా వస్తే, వార్షిక ఆదాయం రూ.3 కోట్ల వరకు ఉన్నా ఐటీఆర్‌-4 ఫైల్‌ చేయవచ్చు.


ఐటీఆర్‌-5

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హెచ్‌యూఎ్‌ఫలకు ఈ రిటర్న్‌ ఫారం వర్తించదు. సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు, అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌, బిజినెస్‌ ట్రస్టులు, ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్స్‌ ఐటీఆర్‌-5 ద్వారా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి.

ఐటీఆర్‌-6

ప్రత్యేక కంపెనీల నిర్వచనం పరిధిలోకి రాని కంపెనీలు మాత్రమే ఈ ఫారం ద్వారా తమ ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్‌-7

ఛారిటబుల్‌, మతపరమైన ట్రస్టులు, రాజకీయ పార్టీలు, పరిశోధనా సంస్థలు, వార్తా సంస్థలు లేదా ఐటీ చట్టంలో పేర్కొన్న ప్రత్యేక సంస్థలు ఐటీఆర్‌-7 ద్వారా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి.

ఎవరు ఎప్పటిలోగా దాఖలు చేయాలంటే..

జీతం మాత్రమే ఆదాయంగా ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎ్‌ఫలు, ఆడిట్‌ చేయాల్సిన అవసరం లేని ఆదాయం ఉన్న వ్యక్తులు ఈ ఏడాది సెప్టెంబరు 15లోగా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి. ఆడిటింగ్‌ పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వ్యక్తులు అక్టోబరు నెలాఖరులోగా ఫైల్‌ చేయాలి. అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు కూడా ఉన్న వ్యక్తులు, సంస్థలైతే నవంబరు నెలాఖరులోగా ఐటీ రిటర్న్‌లు సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 04:05 AM