Home Prices Surge: క్యు2లో ఇళ్ల ధరల్లో 19 శాతం వృద్ధి
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:32 AM
దేశంలోని ఎనిమిది అగ్రగామి నగరాల్లో ఇళ్ల ధరలు జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో 7-19% పెరిగాయి. రియల్టీ కన్సల్టెంట్ ఆరమ్ ప్రాప్‌టెక్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ఇళ్ల ధరలు...
ప్రాప్ టైగర్ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది అగ్రగామి నగరాల్లో ఇళ్ల ధరలు జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో 7-19% పెరిగాయి. రియల్టీ కన్సల్టెంట్ ఆరమ్ ప్రాప్‌టెక్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ఇళ్ల ధరలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గరిష్ఠంగా 19% పెరిగినట్టు తెలిపింది. ప్రధానంగా విలాసవంతమైన ఇళ్లకు డిమాండు గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో అక్కడ చదరపు అడుగు ధర రూ.7,479 ఉండగా ఇప్పుడు రూ.8,900 పలుకుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాలు రెండూ కూడా బలమైన వృద్ధిని నమోదు చేశాయి. హైదరాబాద్‌లో ఇళ్ల ధర 13% వృద్ధితో చదరపు అడుగు రూ.6,858 నుంచి రూ.7,750కి పెరిగింది. బెంగళూరులో చదరపు అడుగు ధర 15ు వృద్ధితో రూ.7,713 నుంచి రూ.8,870కి పెరిగింది.
అమ్మకాలు నీరసం
ఇళ్ల ధరలు దూసుకుపోతుండడం అమ్మకాలను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో టాప్ 8 నగరాల్లో ఇళ్ల అమ్మకాల్లో వృద్ధి స్వల్పంగానే ఉన్నట్టు హౌసింగ్ డాట్ కామ్ తాజా నివేదికలో తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ ఎనిమిది నగరాల్లోనూ కలిపి మొత్తం 96,544 ఇళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది 96,827 ఇళ్లు అమ్ముడుపోయాయి. అలాగే కొత్తగా ప్రారంభమైన ఇళ్ల నిర్మాణం 91,863 నుంచి 94,419కి పెరిగింది. గత అర్ధ దశాబ్ది కాలంలోనూ ధరలు విపరీతంగా పెరిగిపోవడం అఫర్డబుల్ హౌసింగ్ విభాగంలో అమ్మకాలు తగ్గడానికి కారణమయిందని ఈ పోర్టల్ యాజమాన్య సంస్థ రియా సీఈఓ ప్రవీణ్ శర్మ అన్నారు. అయితే ప్రీమియం విభాగంలో మాత్రం డిమాండు బలంగా ఉన్నట్టు చెప్పారు. ఇళ్ల అమ్మకాలు పెరగాలంటే అఫర్డబుల్ విభాగంలో సరఫరా పెంచేందుకు డెవలపర్లను ప్రోత్సహించాలని, కొనుగోలదారుల భరించగల స్థాయి ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 8 నగరాల్లోనూ ఇళ్ల అమ్మకాల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. హైదరాబాద్‌లో అమ్మకాలు 5ు పెరిగి 11,164 యూనిట్ల నుంచి 12,138 యూనిట్లకు చేరాయి. ప్రధానంగా అహ్మదాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై రీజిన్, పూణె నగరాల్లో అమ్మకాలు క్షీణించగా బెంగళూరు, చెన్నై, కోల్కతా నగరాల్లో పెరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు