రుణగ్రహీతలకు ఊరట
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:44 AM
రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు ఇక తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై నెలవారీ కిస్తీ (ఈఎంఐ)ల భారం కాస్త తగ్గనుంది...

తగ్గనున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు.. ఈఎంఐ చెల్లింపుల భారం కూడా..
రెపో రేటు 0.25 శాతం తగ్గింపు.. 6.25ు నుంచి 6 శాతానికి దిగివచ్చిన రెపో
కీలక వడ్డీ రేట్లపై భవిష్యత్ వైఖరి
తటస్థం నుంచి అనుకూల స్థాయికి మార్పు
మున్ముందు మరింత తగ్గిస్తామని సంకేతాలు
2025-26 ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనా
6.7 శాతం నుంచి 6.5 శాతానికి కుదింపు
ద్రవ్యోల్బణం అంచనా 4 శాతానికి తగ్గింపు
పరపతి సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన ఆర్‌బీఐ
జూన్ 4-6 తేదీల్లో తదుపరి సమీక్ష నిర్వహణ
ముంబై: రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు ఇక తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై నెలవారీ కిస్తీ (ఈఎంఐ)ల భారం కాస్త తగ్గనుంది. ఎందుకంటే, బ్యాంకు ల రుణ రేట్లకు ప్రామాణికాల్లో ఒకటైన రెపో రేటును మరో పావు (0.25) శాతం తగ్గిస్తున్నట్లు ద్రవ్య పరపతి సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. దాంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. అంతేకాదు, కీలక వడ్డీ (రెపో) రేటుపై భవిష్యత్ వైఖరిని కూడా ‘తటస్థం’ నుంచి ‘సర్దుబాటుకు అనుకూల’ స్థాయికి మార్చిం ది. అంటే, మున్ముందు సమీక్షల్లో మరింత తగ్గించే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చింది. సర్దుబాటుకు అనుకూల స్థాయి వైఖరితో రిజర్వ్ బ్యాంక్ అవసరాన్ని బట్టి వడ్డీ రేట్ల ను తగ్గించడం లేదా యథాతథంగా కొనసాగిస్తుంది. అంతేతప్ప పెంచదు. ఆర్‌బీఐ ‘రెపో’ను తగ్గించడం వరుసగా ఇది రెండోసారి. 2020 మే తర్వాత తొలిసారిగా ఈ ఫిబ్రవరి సమీక్షలోనూ పావు శాతం తగ్గించింది. తాజా రెపో తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేసిన పక్షంలో (రెపో ప్రామాణిక) రుణాలపై వడ్డీ రేట్లు 2022 నవంబరు నాటి కనిష్ఠ స్థాయికి తగ్గే అవకాశం ఉంది.
ఏకగ్రీవ నిర్ణయం
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో నిర్వహించిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల పాటు (ఈ నెల 7-9 తేదీల్లో) సమావేశమైంది. ట్రంప్ సుంకాలతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో మన జీడీపీ వృద్ధికి ఊతమిచ్చేందుకు రెపో రేటును పావు శాతం తగ్గించాలని సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే, భారత ఎగుమతులపై ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇది మన ఎగుమతులతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధికి సైతం 0.20-0.40 శాతం మేర గండికొట్టవచ్చన్న అంచనాలున్నాయి.
పీ2ఎం చెల్లింపుల పరిమితి పెంపు
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా విక్రేతలకు వ్యక్తులు జరిపే చెల్లింపుల (పీ2ఎం పేమెంట్స్) పరిమితిని పెంచేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పరిమితులను సడలించేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రసుతం ఒక వ్యక్తి మరో వ్యక్తికి (పీ2పీ), వ్యక్తి విక్రేతకు (పీ2ఎం) గరిష్ఠంగా రూ.లక్ష వరకు చెల్లింపు జరపవచ్చు.
బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరం
మన బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా, భద్రంగా, పటిష్ఠంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. ఇండ్‌సఇండ్ బ్యాంక్ సహా కొన్ని బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీల్లో సంక్షోభాలు కేవలం వ్యవస్థలో కొన్ని అంకాలే తప్ప పూర్తి వైఫల్యం కాదన్నారు. తమ డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో రూ.2,100 కోట్ల అకౌంటింగ్ వ్యత్యాసాన్ని గుర్తించామని, ఇది బ్యాంక్ విలువను దాదాపు 2.35 శాతం వరకు ప్రభావితం చేయవచ్చని ఇండ్‌సఇండ్ బ్యాంక్ ఈ మధ్యనే ప్రకటించింది. దాంతో బ్యాంక్ షేరు భారీగా క్షీణించడంతో చిన్న మదుపరులు, ఇతర ఇన్వెస్టర్లు నష్టపోవాల్సి వచ్చింది. అలాగే, ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, అవియోమ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దివాలా తీశాయి. అయితే, ఇవన్నీ వ్యక్తిగత ఉదంతాలేనని బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరతకు ముప్పేమీ లేదన్నారు.
నేను సంజయ్.. భారతంలో సంజయుడిని కాను..
8 నాకు దివ్య దృష్టి లేదు..
8 వడ్డీరేట్లు ఇంకెంత తగ్గుతాయో
ఇప్పుడే చెప్పలేనన్న ఆర్‌బీఐ గవర్నర్
ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాల ప్రకటన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయా..? అన్న ప్రశ్నకు ఆర్‌బీఐ గవర్నర్ తనదైన శైలిలో జవాబిచ్చారు. నా పేరు సంజయ్. కానీ, మహాభారతంలో సంజయుడిని కాను. ఆయన లాగా దివ్యదృష్టి లేదన్నారు. ‘‘జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో మూలధన పెట్టుబడుల పెంపు, భారీగా పన్ను మినహాయింపు వంటి చర్యలను చేపట్టింది. మేం రెపో రేటును తగ్గించడంతో పాటు రేట్లపై భవిష్యత్ వైఖరిని అనుకూలంగా మార్చాం. భవిష్యత్‌లో వడ్డీ రేట్లు ఇంకెంత తగ్గుతాయనేది నేనిప్పుడే చెప్పలేను. నేను సంజయ్. కానీ, మహాభారతంలోని సంజయుడిని కాను. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడగలిగే దివ్యదృష్టి నాకు లేదు’’ అని ఆయన చమత్కరించారు. రుణగ్రహీతలకు రెపో తగ్గింపు ప్రయోజనాలు త్వరితగతిన బదిలీ అయ్యేందుకు వీలుగా బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యతను నిర్వహిస్తామని గవర్నర్ అన్నారు.
సుంకాలతో ఎగుమతులకు గండి
ఆర్థిక ప్రగతిపై అనిశ్చితి మబ్బులు
ట్రంప్ సుంకాలతో అన్ని దేశాల ఆర్థిక ప్రగతిపై ఆనిశ్చితి మబ్బులు కమ్ముకున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ప్రపంచ వృద్ధి, ధరల నియంత్రణకు కొత్త అవరోధంగా పరిణమించవచ్చని ఆయన హెచ్చరించారు. సుంకాలతో వాణిజ్య యుద్ధాలు తీవ్రతరమైతే, మన ఎగుమతులు గణనీయంగా తగ్గే ప్రమాదమూ ఉందన్నారు. అంతేకాదు, ట్రంప్ సుంకాలు ద్రవ్యోల్బణం కంటే జీడీపీ వృద్ధిపైనే అధిక ప్రభావం చూవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వృద్ధి అంచనాల్లో కోత
ట్రంప్ సుంకాలు వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు ఆర్థిక అనిశ్చితిని పెంచటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాను ఈ ఫిబ్రవరిలో ప్రకటించిన 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈసారి వ్యవసాయ రంగ పనితీరు ఆశాజకంగా ఉండవచ్చని, తయారీ రంగం తిరిగి కోలుకుంటోందని సేవల రంగం చురుకుగా ముందుకు సాగుతోందని మల్హోత్రా అన్నారు. దేశంలో ప్రైవేట్ పెట్టుబడులూ పుంజుకుంటున్నాయని, మున్ముందు మరింత పెరగవచ్చన్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తోందని.. కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటం వృద్ధికి దోహదపడగలవన్నారు. ట్రంప్ సుంకాలతో వాణిజ్య అవరోధాలు ఆర్థిక ప్రగతికి ప్రతికూలంగా పరిణమించవచ్చన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనాలు %)
త్రైమాసికం వృద్ధి ద్రవ్యోల్బణం
తొలి 6.5 4.0
రెండు 6.7 3.6
మూడు 6.6 3.8
నాలుగు 6.3 4.4
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..