GST Cut Boosts Sensex: ఆరంభ ఉత్సాహం ఆవిరి
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:22 AM
జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం ట్రేడింగ్ ఆరంభంలో భారీగా పుంజుకున్నాయి...
జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో ప్రారంభంలో సెన్సెక్స్ 889 పాయింట్లు అప్
చివరికి స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
ముంబై: జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం ట్రేడింగ్ ఆరంభంలో భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 888.96 పాయింట్ల లాభంతో 81,456.67 ట్రేడింగ్ ప్రారంభించింది. సూచీకిదే ఇంట్రాడే గరిష్ఠ స్థాయి కూడా. జీఎ్‌సటీ తగ్గింపుతో అధికంగా లబ్దిపొందనున్న ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్, ఇన్సూరెన్స్ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది. అయితే, ఆరంభంలోని ఉత్సాహం క్రమంగా నీరుగారుతూ వచ్చింది. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ సహా ఇతర రంగాల షేర్లలోనూ లాభాల స్వీకరణ కారణంగా క్రమంగా తగ్గుతూ వచ్చిన సూచీలు చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెన్సెక్స్ కేవలం 150.30 పాయింట్ల వృద్ధితో 80,718.01 వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ఠ స్థాయితో పోలిస్తే, సూచీ 738 పాయింట్లు తగ్గింది. మరోవైపు ఆరంభంలో 25,000 స్థాయికి చేరువైన నిఫ్టీ.. చివరికి 19.25 పాయింట్ల లాభంతో 24,734.30 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 11 మాత్రమే రాణించాయి.