PSU Mergers Under Review: పీఎస్‌బీల్లో మరో మెగా విలీనం!
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:10 AM
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) స్వరూపం మరింత మారనుంది. విలీనాల ద్వారా వీటి ఆర్థిక పరిస్థితులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.....
12 నుంచి 4కి తగ్గించే యోచన..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- కెనరా బ్యాంక్ మెర్జర్?
పెద్ద బ్యాంకుల్లో చిన్న బ్యాంకుల విలీనానికి కసరత్తు
ప్రభుత్వం ముందుకు ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) స్వరూపం మరింత మారనుంది. విలీనాల ద్వారా వీటి ఆర్థిక పరిస్థితులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 12గా ఉన్న పీఎ్‌సబీలను 2027 మార్చి నాటికి విలీనాల ద్వారా నాలుగు కు కుదించాలని యోచిస్తోంది. ఇందుకోసం మరో మెగా విలీనాలకు కసరత్తు చేస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం)లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఎస్‌బీఐ వంటి పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), కెనరా బ్యాంక్‌లను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే?
2047 నాటికి ప్రపంచంలోని టాప్-50 బ్యాంకుల్లో కనీసం రెండు మూడు భారతీయ బ్యాంకులు ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. చిన్న పీఎ్‌సబీలను పెద్ద పీఎ్‌సబీల్లో విలీనం చేయడమే ఇందుకు మార్గమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. నీతి ఆయోగ్ ఇప్పటికే ఐవోబీ, సీబీఐ వంటి చిన్న పీఎ్‌సబీలను ప్రైవేటీకరణ అయినా చేయండి లేదా పెద్ద పీఎ్‌సబీల్లోనైనా విలీనం చేయండి అని సిఫారసు చేసింది. విలీనాలైతే ఉద్యోగ సంఘాల నుంచి పెద్దగా వ్యతిరేకత కూడా ఉండకపోవచ్చని అంచనా. దీంతో ప్రభుత్వం కూడా మరో విడత పీఎ్‌సబీల విలీనానికే మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతానికైతే ఆ ఆలోచనే లేదు
మరోవైపు ప్రభుత్వం ఈ వార్తలను తోసిపుచ్చింది. ప్రస్తుతం తమ వద్ద అలాంటి ప్రతిపాదనే లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీఎ్‌సబీల విలీనాలు గానీ, స్థిరీకరణ గానీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేవన్నారు.
నేటి నుంచి బీఓఎం ఓఎ్‌ఫఎస్
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) ఈక్విటీలో ఆరు శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తోంది. మంగళవారమే ఈ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ప్రారంభం కానుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.2,600 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. 2026 మార్చిలోగా అన్ని లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలన్న సెబీ ఆదేశాలకు అనుగుణంగా బీఓఎం ఈ ఓఎ్‌ఫఎస్ జారీ చేస్తోంది.
త్వరలో ప్రతిపాదన
ప్రస్తుతం ఈ విలీన యోచన ఇంకా అధికారుల స్థాయిలోనే ఉంది. త్వరలోనే దీనిపై మరింత కూలంకషంగా చర్చించి ఆ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్, ప్రధానమంత్రి కార్యాలయాలకు పంపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై మాట్లాడేందుకు బ్యాంకులు, ప్రభుత్వ అధికార వర్గాలు నిరాకరిస్తున్నాయి. మొత్తం మీద త్వరలోనే పీఎ్‌సబీల్లో మరో విలీనం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.