Gold Prices Surge: బంగారం...14 సంవత్సరాల్లో అత్యుత్తమ నెలవారీ వృద్ధి
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:25 AM
బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతూనే ఉన్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో..
ముంబై: బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతూనే ఉన్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో రూ.500 పెరిగి రూ.1.20 లక్షలకు చేరింది. ఆభరణాల బంగారం (99.5ు) సైతం రూ.500 పెరిగి 1,19,400 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.500 పెరిగి రూ.1,50,500 స్థాయిని తాకింది. స్వల్పకాలిక ఫండింగ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో ప్రభుత్వ షట్ డౌన్ తప్పకపోవచ్చునన్న భయాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఈక్విటీల నుంచి బులియన్ వైపు ఆకర్షించేందుకు దోహదపడ్డాయి. బంగారం ధరలకు ఇది 14 సంవత్సరాల కాలంలో అత్యుత్తమ నెలవారీ వృద్ధి అని చెబుతున్నారు. సెప్టెంబరు నెలలో బంగారం ధర 11.4ు పెరిగింది. 2011 ఆగస్టులో నమోదైన అత్యధిక నెలవారీ వృద్ధి 15ు తర్వాత ఒక నెలలో ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. అయితే అంతర్జాతీయ విపణిలో ధరలు మాత్రం రికార్డు స్థాయిల నుంచి దిగజారాయి. స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.55ు దిగజారి 3813.14 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా 1.51ు దిగజారి ఔన్సు 46.22 డాలర్లు పలికింది. ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పసిడి మదుపరులకు మంచి లాభాలు పంచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు పసిడి ధర 23.5 శాతం పెరిగింది.’