చుక్కల్లో పసిడి ధర.. మదుపు చేయటం ఎలా?
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:47 AM
పసిడి ధర జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డులు సృష్టిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం ఈ మధ్యనే రూ.లక్ష తాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర....
పసిడి ధర జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డులు సృష్టిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం ఈ మధ్యనే రూ.లక్ష తాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర 3,500 డాలర్లను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ బుల్ రన్‌లో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలు ఏంటో చూద్దాం..
పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది కాలంలో పసిడిలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు 40 శాతం వరకు లాభాలు పంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోరుతో పసిడి ధర ఇప్పటికే రికార్డు స్థాయికి చేరింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా ఔన్స్ పసిడి ధర 3,700 నుంచి 3,950 డాలర్ల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా. ఆర్థిక అనిశ్చితి రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడుల రక్షణ కోసం పసిడిని మించిన సురక్షిత పెట్టుబడి మరొకటి లేదు. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపరులకు పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం..
లిస్టెడ్ ఎస్‌జీబీలు
కొత్తగా సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీ) జారీని ప్రభుత్వం నిలిపి వేసింది. అయితే 2015 నుంచి 67 విడతలుగా జారీ చేసిన 14.7 కోట్ల యూనిట్ల ఎస్‌జీబీలు ఇప్పటికే బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ క్యాష్ సెగ్మెంట్‌లో ట్రేడవుతున్నాయి. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఇవి మూడు నుంచి నాలుగు శా తం డిస్కౌంట్‌కు కూడా లభిస్తున్నాయి. డీమ్యాట్ ఫార్మాట్‌లో పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరులకు ఎస్‌జీబీలు అత్యంత అనువైనవి. ఎనిమిదేళ్ల కాలపరిమితితో జారీ చేసిన ఈ ఎస్‌జీబీల లాక్ ఇన్ పీరియడ్ ఐదేళ్లు. ఐదు, ఆరు, ఏడేళ్ల గడువు ముగిసిన ఎస్‌జీబీలను ఆర్‌బీఐ బైబ్యాక్ కూడా చేస్తుంది. పెట్టుబడుల వివిధీకరణ కోరుకునే మదుపరులు సెకండరీ మార్కెట్లో లభిస్తున్న ఎస్‌జీబీలనూ పరిశీలించవచ్చు.
గోల్డ్ ఈటీఎ్‌ఫలు
నేరుగా బంగారం కొని దాచుకోలేని మదుపరుల ముందు ఉన్న మరో ఆప్షన్ గోల్డ్ ఈటీఎఫ్‌లు. డీమ్యాట్ ఖాతా ఉన్న ఎవరైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో గోల్డ్ ఈటీఎఫ్.. యూనిట్ల రూపంలో అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణం గా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో కూడా లిస్టయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రేడింగ్ రోజుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. కాకపోతే ఇందుకు కొద్దిగా బ్రోకరేజీ చార్జీలు చెల్లించాలి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చుల నిష్పత్తి తక్కువ. అయితే వీటిని అమ్మాలన్నా.. కొనాలన్నా ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
గోల్డ్ ఎంఎ్‌ఫలు
పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరులు మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలు అందించే గోల్డ్ ఎంఎ్‌ఫలనూ పరిశీలించవచ్చు. ఇవి ఓపెన్ ఎండెడ్ ఎంఎఫ్ పథకాలు. ఈ పథకాల ద్వారా సమీకరించే నిధులను ఎంఎ్‌ఫలు గోల్డ్ ఈటీఎ్‌ఫల్లో మదుపు చేస్తాయి. ట్రేడింగ్ డే ముగిసిన వెంటనే ఎంఎ్‌ఫలు ఈ గోల్డ్ ఎంఎ్‌ఫల ఎన్‌ఏవీల (నెట్ అసెట్ వాల్యూ)ను ఏ రోజుకు ఆ రోజు ప్రకటిస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. కాకపోతే గోల్డ్ ఈటీఎ్‌ఫలతో పోలిస్తే గోల్డ్ ఎంఎ్‌ఫల ఖర్చులు కొద్దిగా ఎక్కువ. మొత్తం ఎన్‌ఏవీలో ఈ ఖర్చులు ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉంటాయి.
ఫిజికల్ గోల్డ్
మార్కెట్ నుంచి నేరుగా బంగారం కొనుగోలు చేయటం ఒక పద్ధతి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇలా కొనేటప్పుడు ఆ పసిడి స్వచ్ఛత స్పష్టంగా తెలుసుకోవాలి. లేకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఈ బంగారాన్ని భద్రంగా దాచుకోవటం మరో సమస్య. ఈ రెండు అంశాలపై భరోసా ఉన్న మదుపరులు నేరుగా పసిడి కొనుగోలు చేసి అలానే లేదా నగల రూపంలో భద్రపరుచుకోవచ్చు.
ఎంత మదుపు చేయాలి?
మన మొత్తం పెట్టుబడుల్లో ఎంత వాటాను పసిడిలో మదుపు చేయాలనేది పెద్ద ప్రశ్న. సాధారణ పరిస్థితుల్లో కనీసం 10 శాతం, అసాధారణ పరిస్థితుల్లో 15 నుంచి 20 శాతం వరకు పసిడి సాధనాల్లో మదుపు చేయడం మంచిది. దీనివల్ల పెట్టుబడులకు భద్రత తో పాటు కాలం కలిసి వస్తే మంచి లాభాలూ కళ్ల చూడవచ్చు.