Gold Loans India: పసిడి రుణాలు రికార్డు స్థాయికి
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:10 AM
బంగారం విలువ వేగంగా ఎగబాకుతోంది. గడిచిన ఏడాది కాలంలో 10 గ్రాముల పసిడి రేటు 53 శాతం పెరిగింది. దాంతో బంగారం తాకట్టు పెట్టి...
న్యూఢిల్లీ: బంగారం విలువ వేగంగా ఎగబాకుతోంది. గడిచిన ఏడాది కాలంలో 10 గ్రాముల పసిడి రేటు 53 శాతం పెరిగింది. దాంతో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలూ అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.2.94 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 ఏప్రిల్‌లో ఇది కేవలం రూ.1.02 లక్షల కోట్లే. ఈ రుణాలు ఆల్‌టైం రికార్డు స్థాయికి పెరగడం వరుసగా ఇది 15వ నెల. అంతేకాదు, ఈ మార్చి నుంచి ప్రతినెలా ఈ రుణాల్లో వార్షిక ప్రాతిపదికన 100 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. బంగారం ధరలు పెరుగుతున్నంత కాలం గోల్డ్ లోన్స్‌లోనూ అప్‌ట్రెండ్ కొనసాగనుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాసన్ అన్నారు.
ఇవీ కారణాలు: బంగారం తాకట్టుపై గతంలో కంటే అధికం రుణం లభిస్తుండటం, బ్యాంకులు తనఖా రహిత వ్యక్తిగత రుణాల మంజూరులో ఆచితూచి వ్యవహరిస్తుండటం ఇందుకు ప్రధానం కారణం. వ్యక్తిగత రుణంతో పోలిస్తే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ కూడా తక్కువగా ఉండటమూ మరో కారణం. వ్యక్తిగత రుణం లభించే అవకాశం లేనివారికి బంగారం తనఖా రుణాలు మంచి ప్రత్యామ్నయంగా మారాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.
10 గ్రాముల ధర రూ.1.13 లక్షలకు చేరిక
దేశీయంగా బంగారం ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.100 పెరిగి రూ.1,13,100కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం రేటు కూడా రూ.100 పెరిగి ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1,12,600 స్థాయికి ఎగబాకింది. 2024 డిసెంబరు 31న రూ.78,950గా నమోదైన 10 గ్రాముల మేలిమి బంగారం ధర.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.34,150 మేర (43.25 శాతం) పుంజుకుంది. కాగా, కిలో వెండి రూ.500 పెరుగుదలతో రూ.1,28,000కు చేరుకుంది.