Share News

Technology Experts: ఫాక్స్‌కాన్‌ బెంగళూరు ప్లాంట్‌లో ఐఫోన్‌ 17 ఉత్పత్తి షురూ

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:10 AM

తైవాన్‌ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌.. యాపిల్‌ ఐఫోన్స్‌ అసెంబ్లింగ్‌ కోసం భారత్‌లో అతిపెద్ద యూనిట్‌ను ప్రారంభించింది.

Technology Experts: ఫాక్స్‌కాన్‌ బెంగళూరు ప్లాంట్‌లో ఐఫోన్‌ 17 ఉత్పత్తి షురూ

న్యూఢిల్లీ: తైవాన్‌ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌.. యాపిల్‌ ఐఫోన్స్‌ అసెంబ్లింగ్‌ కోసం భారత్‌లో అతిపెద్ద యూనిట్‌ను ప్రారంభించింది. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఐఫోన్‌ 17 అసెంబ్లింగ్‌ ప్రారంభించినట్లు సమాచారం. అయితే యాపిల్‌ కంపెనీ, ఫాక్స్‌కాన్‌ గానీ దీనిపై అధికారికంగా నోరు మెదపడం లేదు. ఈ ప్లాంట్‌ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్‌ 280 కోట్ల డాలర్లు (సుమారు రూ.25,000 కోట్లు) ఖర్చు చేసింది. ఐఫోన్స్‌ అసెంబ్లింగ్‌ కోసం చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌ ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్లాంటు ఇదేనని భావిస్తున్నారు. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌ వద్ద ఏర్పాటు చేసిన యూనిట్‌లోనూ ఫాక్స్‌కాన్‌ ఐఫోన్‌ 17ను అసెంబ్లింగ్‌ చేస్తోంది. ఐఫోన్‌ 17ను యాపిల్‌ సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.


చైనా నిపుణులు లేకపోయినా..

కాగా చైనా.. ఈ ప్లాంట్‌ నుంచి కూడా తన సాంకేతిక నిపుణులను వెనక్కి తీసుకుంది. దాంతో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఫాక్స్‌కాన్‌.. తైవాన్‌, ఇతర దేశాల నుంచి నిపుణులను రప్పించి భారత్‌లో ఐఫోన్స్‌ ఉత్పత్తిని పెంచుతోంది. ఫాక్స్‌కాన్‌ గత ఆర్థిక సంవత్సరం మన దేశంలో యాపిల్‌కి చెందిన దాదాపు 4 కోట్ల ఐఫోన్లు తయారు చేసింది. వీటి విలువ 2,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.92 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కనీసం 6 కోట్ల ఐఫోన్లను భారత్‌లో అసెంబ్లింగ్‌ చేయించాలని యాపిల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - Aug 18 , 2025 | 05:11 AM