Navratri sales: నవరాత్రి అమ్మకాల జాతర
ABN , Publish Date - Oct 04 , 2025 | 02:57 AM
గురువారంతో ముగిసిన దసరా నవరాత్రులు విభిన్న రంగాల కు చెందిన కంపెనీలకు హర్షాతిరేకాన్ని పంచాయి...
ఇటు పండుగ సందడి, అటు ధరల తగ్గింపు
కొనుగోళ్లకు పోటెత్తిన కస్టమర్లు
న్యూఢిల్లీ: గురువారంతో ముగిసిన దసరా నవరాత్రులు విభిన్న రంగాల కు చెందిన కంపెనీలకు హర్షాతిరేకాన్ని పంచాయి. నిత్యావసర వస్తువులతో పాటు ఆటోమొబైల్, కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్, వినియోగ వస్తువుల కంపెనీలు రికార్డు అమ్మకాలు నమోదు చేశాయి. గత నెల 22 నుంచి అమలులోకి వచ్చి న జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు పండుగ కొనుగోళ్లకు కొత్త ఉత్తేజం అందించిందని కంపెనీలు చెబుతున్నాయి. దీనికి తోడు బడ్జెట్లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు కూడా వినియోగవృద్దికి దోహదపడ్డాయి. జీఎ్‌సటీ రేట్లు అమలులోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజలు తమకు కావలసిన వస్తువులు, గృహోపకరణాలు, కార్ల కొనుగోలుకు పరుగు లు తీసినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో విలువ, పరిమాణంపరంగా రెండంకెల వృద్దికి ఈ అమ్మకాలు దోహదపడతాయని పలు కంపెనీలు భావిస్తున్నాయి. కేరళలో ఓనం నుంచి ప్రారంభమై దీపావళితో ముగిసే 45 రోజుల పండుగల సీజన్‌లో మిగిలిన రోజుల్లో కూడా ఇదే ఉత్సాహం కొనసాగవచ్చునని ఆశ పడుతున్నాయి.

మారుతి అమ్మకాలు పదేళ్ల గరిష్ఠం
కార్ల దిగ్గజం మారుతి పదేళ్ల కాలంలో గరిష్ఠ అమ్మకాలు నమోదు చేసింది. నవరాత్రి తొలి ఎనిమిది రోజుల కాలంలో 1.65 లక్షల కార్లను విక్రయించింది. గత ఏడాది నవరాత్రి పర్వదినాల్లో కంపెనీ 85 వేల కార్లు మాత్రమే విక్రయించింది. ఈ సీజన్‌లో 2 లక్షల అమ్మకాల మైలురాయి చేరగలమన్న ఆశతో ఉంది. దీనికి తోడు ప్రస్తుతం కంపెనీ చేతిలో రెండున్నర లక్షల బుకింగ్‌లున్నాయి. కాగా సెప్టెంబర్ నెలలో తమ ఉత్పత్తి 26ు పెరిగి 2,01,915 యూనిట్లకు చేరినట్టు మారుతి తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో సంస్థ 1,59,743 యూనిట్లు ఉత్పత్తి చేసింది. కాంపాక్ట్ కార్లు, యుటిలిటీ వెహికల్స్, ఎంట్రీ లెవెల్ మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ వృద్ధి సాధ్యమైందని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుండయ్ కంపెనీలు కూడా భారీ అమ్మకాలు నమోదు చేసినట్టు ప్రకటించాయి.
పెద్ద స్ర్కీన్ టీవీలపై మోజు
కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ రంగంలోని ఎల్‌జీ, హేయర్, గోద్రెజ్ అప్లయెన్సెస్ కూడా గత నవరాత్రితో పోల్చితే ఈ సీజన్‌లో భారీగా రెండంకెల అమ్మకాల వృద్ధిని నమోదు చేసినట్టు ప్రకటించాయి. తగ్గిన జీఎ్‌సటీ రేట్లను పరిగణనలోకి తీసుకుని ఇప్పటివరకు చిన్న తెర టీవీలను వినియోగిస్తున్న వారు పెద్ద స్ర్కీన్ టీవీలు కొనేందుకు ఆసక్తి చూపారు. అలాగే ఇంధన సామర్థ్యం గల ఎయిర్ కండిషనర్లు కొనుగోలు చేశారు. రెండున్నర లక్షలకు పైగా ధర గల 85-100 అంగుళాల టీవీలు భారీగా అమ్ముడుపోయినట్టు హేయర్ ప్రకటించింది. దేశంలోని అతి పెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ అమ్మకాలు 20-25ు పెరిగినట్టు తెలుస్తోంది. విజయ్ ఎలక్ర్టానిక్స్ అమ్మకాలు సైతం 20ు పెరిగాయి.