జీవిత బీమా పాలసీదారులకు రైడర్లతో మరింత రక్షణ
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:44 AM
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. హఠాత్పరిణామాలను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండటమే ఉత్తమ వ్యూహం. ఆపద నుంచి రక్షించే కవచాల్లో బీమా ఒకటి. అది ఉంటే మీకే కాదు...
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. హఠాత్పరిణామాలను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండటమే ఉత్తమ వ్యూహం. ఆపద నుంచి రక్షించే కవచాల్లో బీమా ఒకటి. అది ఉంటే మీకే కాదు.. మీ కుటుంబ భవిష్యత్‌కూ ధీమా. అయితే, ఏ బీమా పథకమైనా కొన్ని సందర్భాల్లో పాలసీదారును ఆకస్మిక అవసరం నుంచి గట్టెక్కించలేకపోవచ్చు. అలాంటప్పుడే రైడర్లు పనికొస్తాయి. పాలసీ కవరేజీని విస్తరించే అదనపు ఫీచర్ల జోడింపే రైడర్. ఇవి పాలసీ పరిధిని విస్తృతపరచడం ద్వారా సంపూర్ణ రక్షణ కల్పిస్తాయి.
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ పరిగణించాల్సిన పాలసీ. పాలసీదారు పాలసీ గడువు కాలంలో దురదృష్టవశాత్తు మరణిస్తే.. తన కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసాను కల్పిస్తుంది. టర్మ్ పాలసీ ద్వారా ఎంత మేర బీమా కవరేజీ కలిగి ఉండాలన్నది వ్యక్తి లేదా కుటుంబ అవసరంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మీ వార్షికాదాయానికి కనీసం 10-15 రెట్ల బీమా కవరేజీ కొనుగోలు చేయడం మేలు. టర్మ్ పాలసీతో పాటు అదనంగా రైడర్లను ఎంపిక చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్‌కు సమగ్ర బీమా కవరేజీని పొందవచ్చు. టర్మ్ పాలసీతో పాటు పరిగణించాల్సిన మూడు కీలక రైడర్ల వివరాలు..
యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్: పాలసీదారు ఒకవేళ యాక్సిడెంట్‌లో మరణిస్తే ఈ రైడర్ కలిగి ఉండటం ద్వారా నామినీకి అదనపు డెత్ బెనిఫిట్ ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు, యాక్సిడెంట్ కారణంగా అంగ వైకల్యం ఏర్పడిన సందర్భంలోనూ పాలసీదారుకు ఆర్థిక మద్దతును ఈ రైడర్ కల్పిస్తుంది. ముఖ్యంగా నిర్మాణ రంగం లేదా గనుల్లో పనిచేసే వారు, ఉద్యోగ రీత్యా వాహనంపై సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సిన వారికి ఈ రైడర్ ప్రయోజనకరం.
క్రిటికల్ ఇల్‌నెస్: క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య ఖర్చులకు ఈ రైడర్ కవరేజీ కల్పిస్తుంది. ముఖ్యంగా కుటుంబ పెద్ద లేదా పోషకులు తప్పకుండా కలిగి ఉండాల్సిన రైడర్ ఇది. ఎందుకంటే, ఈ కాలంలో కార్పొరేట్ వైద్యం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది.
ప్రీమియం రాయితీ: అంగ వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం కారణంగా పాలసీదారు ప్రీమియం చెల్లించలేని స్థితిలోనూ బీమా కవరేజీ కొనసాగేందుకు ఈ రైడర్ తోడ్పడుతుంది. అధిక రిస్క్‌తో కూడిన వృత్తుల వారికిది ప్రయోజనకరం.