Elon Musk Net Worth Drop: ట్రంప్ ప్రభుత్వంలో చేరిన ఫలితం..మస్క్ ఎంత నష్టం వచ్చిందో చూస్తే
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:15 PM
ప్రజల్లో మస్క్‌పై పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా ఆయన నికర సంపదలో భారీగా కోత పడింది. వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ మస్క్ సంపద 121 బిలియన్ డాలర్ల మేర తరిగిపోయింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు పునర్‌వైభవాన్ని తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానంటూ ట్రంప్ ప్రభుత్వం సలహాదారుగా మారిన టెక్ ఆంతప్రెన్యూర్‌కు గత కొద్ది నెలలుగా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పొదుపు పేరిట ప్రభుత్వ ఉద్యోగల తొలగింపు, ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ అతిగా జోక్యం చేసుకున్నట్టు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో మస్క్ సంపదలో వేల కోట్లు కరిగిపోయాయి. టెస్లా కార్లు అమ్మకాలు పడిపోవడంతో కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో మస్క్ నాయకత్వంపై ఇన్వెస్టర్లలో నమ్మకం సన్నగిల్లింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలాన్ మస్క్ సంపదలో ఇప్పటివరకూ 121 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ఈ ఏడాది అత్యధికంగా నష్టపోయిన బిలియనీర్లలో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. ఏప్రిల్ 10 నాటికి మస్క్ నికర సంపద విలువ 311 బిలియన్ డాలర్లు. టెస్లా షేర్ల పతనమే మస్క్ సంపద కరిగిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ట్రంప్ సుంకాల కారణంగా ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్లు 172 బిలియన్ డాలర్ల సంపద కోల్పోగా మస్క్ ఒక్కరే 35 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.
ఇంత నష్టాన్ని చవి చూసినా కూడా మస్క్ ప్రపంచ బిలియనీర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. టెస్లాతో పాటు స్పేస్‌ఎక్స్ వంటి సంస్థల్లో ఆయన వాటా కారణంగా సంపద ఇప్పటికీ పీక్స్‌లోనే ఉంది. గతేడాది డిసెంబర్‌లో తొలిసారిగా మస్క్ సంపద 400 బిలియన్ డాలర్ల మార్కు దాటింది. ఆ తరువాత ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మస్క్ సంపద కరిగిపోవడం మొదలైంది.
ఇదిలా ఉంటే, ప్రభుత్వానికి పొదుపు చర్యలు సూచించేందుకు ఏర్పాటు చేసిన డోజ్ శాఖ నుంచి తప్పుకుంటానంటూ మస్క్ ఇటీవల పరోక్ష సూచనలు చేశారు. డోజ్ శాఖ తన లక్ష్యానికి దగ్గరవుతోందని, వేల కోట్ల డాలర్ల ఖర్చును తగ్గించామని చెప్పుకొచ్చారు. టెస్లా షేర్ల పతనం నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్‌పై వ్యతిరేకత టెస్లాపై అధికంగా పడింది. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ప్రజలు టెస్లా డీలర్‌షిప్‌లు, కంపెనీల ముందు నిరసనలకు దిగారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ కోసం 2 ప్లాన్‌లను ప్రవేశపెట్టిన జియో..20జీబీ ఎక్స్ ట్రా డేటా..
పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె,