SEBI Chair Clarifies: డిజిటల్ గోల్డ్ మా పరిధిలో లేదు
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:41 AM
డిజిటల్ లేదా ఈ గోల్డ్ నియంత్రణలపై సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టత ఇచ్చారు. వీటి నియంత్రణ తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు...
వాటిని నియంత్రించే యోచనా లేదు
‘రీట్స్’ను సూచీల్లో చేర్చే ప్రతిపాదన
సెబీ చైర్మన్ పాండే
న్యూఢిల్లీ: డిజిటల్ లేదా ఈ-గోల్డ్ నియంత్రణలపై సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టత ఇచ్చారు. వీటి నియంత్రణ తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. వీటి అమ్మకాలను నియంత్రించే యోచన కూడా లేదన్నారు. రీట్స్, ఇన్విట్స్‌పై జరిగిన ఒక సదస్సుకు హాజరైన పాండే మీడియాతో మాట్లాడుతూ ఈ విష యం స్పష్టం చేశారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే గోల్డ్ ఈటీఎ్‌ఫలు లేదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్టులు, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీప్ట్స్ మాత్రమే ప్రస్తుతం తమ నియంత్రణ పరిధిలో ఉన్నట్టు పాండే చెప్పారు. కాగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (రీట్స్)ను స్టాక్ మార్కెట్ సూచీల్లో చేర్చే విషయాన్ని పరిశీలిస్తామని పాండే వెల్లడించారు. అయితే సంబంధిత అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ప్రతిపాదన ఆచరణకు నోచుకుంటే రీట్స్ లిక్విడిటీ (లభ్యత) చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతుందన్నారు.
‘ఎంఎ్‌ఫ’ల ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్లు బంద్!
పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ)కు వచ్చే ముందు కంపెనీలు జారీ చేసే షేర్ల ప్రీ-ప్లే్‌సమెంట్‌లో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎ్‌ఫ)లు పాల్గొనడాన్ని సెబీ నిషేధించినట్టు సమాచారం. అయితే ఐపీఓకు ఒకటి రెండు రోజుల ముందే జరిగే యాంకర్ ఇన్వె్‌స్టమెంట్ కోటాలో పాల్గొనేందుకు మాత్రం సెబీ అనుమతించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్ల లభ్యత (లిక్విడిటీ)తో పాటు వాటి విలువ మదింపులో పారదర్శకత పెంచేందుకు ఈ చర్య తోడ్పడుతుందని భావిస్తున్నారు.