Crown LNG and PIL: కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ప్రాజెక్టులో కదలిక
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:34 AM
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద క్రౌన్ ఎల్‌ఎన్‌జీ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసే ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ప్రాజెక్టుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఈ టెర్మినల్‌ను అనుసంధానం చేస్తూ పైప్‌లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్...
పైప్‌లైన్ కోసం క్రౌన్ ఎల్‌ఎన్‌జీ-పీఐఎల్ మధ్య ఎంఓయూ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద క్రౌన్ ఎల్‌ఎన్‌జీ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసే ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ప్రాజెక్టుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఈ టెర్మినల్‌ను అనుసంధానం చేస్తూ పైప్‌లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (పీఐఎల్) పైప్‌లైన్ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై ఇటీవల క్రౌన్ ఎల్‌ఎన్‌జీ హోల్డింగ్స్ సీఈఓ స్వపన్ కటారియా, పీఐఎల్ ఎండీ అఖిల్ మెహరోత్రా సంతకాలు చేశారు. క్రౌన్ ఎల్‌ఎన్‌జీ.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీని రీగ్యాసిఫికేషన్ చేసి దేశ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తుంది.
రూ.9,000 కోట్ల ప్రాజెక్టు: కాకినాడ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ కోసం క్రౌన్ ఎల్‌ఎన్‌జీ హోల్డింగ్స్ రూ.9,000 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. వచ్చే ఏడాది నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా 72 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జీ దిగుమతి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ కోసం కృష్ణ గోదావరి ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని కూడా ఏర్పాటు చేసింది. కాగా ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ (ఇన్విట్).. స్పెషల్ పర్పస్ వెహికల్‌గా పీఐఎల్ ఉంది. ఈ సంస్థ గుజరాత్‌లోని బరూచ్ నుంచి కాకినాడ వరకు దాదాపు 1,400 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా మరికొన్ని సంస్థలు ఇక్కడ క్షేత్రాల నుంచి సహజ వాయువును రవాణా చేసేందుకు ఈ పైప్‌లైన్‌ను ఉపయోగిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..