Freelance Jobs: పర్మినెంట్ ఉద్యోగులెందుకు..
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:39 AM
దేశంలో ఉద్యోగాల స్వరూపం రోజురోజుకు మారిపోతోంది. గతంలోలా కంపెనీలు పర్మినెంట్ ఉద్యోగులను తీసుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు...
ఫ్రీలాన్స్ నిపుణులుండగా..!
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశంలో ఉద్యోగాల స్వరూపం రోజురోజుకు మారిపోతోంది. గతంలోలా కంపెనీలు పర్మినెంట్ ఉద్యోగులను తీసుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. తమ అవసరాలకు అవసరమైన వృత్తి నైపుణ్యాలు ఉన్న ఫ్రీలాన్సర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. తమకు కావలసిన నైపుణ్యాలు ఉన్న ఫ్రీలాన్సర్లు లభిస్తే రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించే జీతాల కంటే 30-40 శాతం అధికంగా చెల్లించి మరీ నియమించుకుంటున్నాయి. టెక్ ప్రాజెక్టుల్లో ఫ్రీలాన్స్ నిపుణులకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. ఏటా వీరి డిమాండ్ 40 శాతం చొప్పున పెరుగుతున్నట్టు కంపెనీలు-వృత్తి నిపుణులను అనుసంధానం చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లెక్సింగ్ ఐటీ’ పేర్కొంది. గత ఏడాది కాలంగా చూసినా ఫ్రీలాన్సింగ్/గిగ్ నియామకాలు 25 నుంచి 30 శాతం పెరిగినట్టు టీమ్‌లీజ్ డిజిటల్ తెలిపింది.
వీరికి మరింత డిమాండ్: ప్రస్తుతం ఐటీ, టెక్ కంపెనీలతో పాటు దాదాపు అన్ని కంపెనీలు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ అమలు చేస్తున్నాయి. దీంతో కృత్రిమ మేధ (ఏఐ), దాని అప్లికేషన్లు, సైబర్ సెక్యూరిటీ, ఐటీ గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో పట్టున్న ఫ్రీలాన్సర్లకు మంచి డిమాండ్ ఉంది. ఐటీ, టెక్ కంపెనీలు వీరిని ఇట్టే తన్నుకుపోతున్నాయి. ఇందుకోసం రెగ్యులర్ ఉద్యోగుల కంటే మంచి మంచి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. కార్మిక చట్టాల బాదరబందీ లేకపోవడంతో కంపెనీలు కూడా ఫ్రీలాన్సర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ఈ తరహా జాబ్ వర్క్ కంపెనీలకూ అనువుగా మారింది.
ఈ కంపెనీల్లో ఎక్కువ : ఫ్రీలాన్స్ నిపుణుల పట్ల మొగ్గు చూపుతున్న కంపెనీల్లో పారిశ్రామిక సేవలు, కన్సల్టెన్సీ, హెల్త్‌కేర్ కంపెనీలు ముందున్నాయి. గత ఏడాది మొత్తం డిమాండ్‌లో 60 శాతం ఈ మూడు రంగాలకు చెందిన కంపెనీల నుంచే వచ్చింది. ఐటీ, టెక్నాలజీ నుంచి వచ్చిన డిమాండ్ 10 శాతానికి మించి లేదు.
ఎఫ్‌ఎంసీజీ, ఆటోమోటివ్ కంపెనీలు కూడా ఫ్రీలాన్స్ నిపుణులను పెద్దఎత్తున నియమించుకుంటున్నాయి. కొన్ని కంపెనీల్లో ఫ్రీలాన్స్ నిపుణులు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) వంటి బాఽధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.