Share News

Common Mistakes: మీ బ్యాంక్ ఖాతాను వేరే బ్రాంచ్‌కు మారుస్తున్నారా? అయితే ఈ తప్పులు అసలు చేయకండి..

ABN , Publish Date - Aug 05 , 2025 | 09:02 PM

ఇల్లు మారినప్పుడు, ఉద్యోగం కోసం మరో ఊరికి వెళ్లినప్పుడు లేదా మెరుగైన సేవలు అందనప్పుడు.. పలువురు ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖలను మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో సాధారణంగా ఖాతాదారులు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

Common Mistakes: మీ బ్యాంక్ ఖాతాను వేరే బ్రాంచ్‌కు మారుస్తున్నారా? అయితే ఈ తప్పులు అసలు చేయకండి..

ఇల్లు మారినప్పుడు, ఉద్యోగం కోసం మరో ఊరికి వెళ్లినప్పుడు లేదా మెరుగైన సేవలు అందనప్పుడు.. పలువురు ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖలను మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో సాధారణంగా ఖాతాదారులు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేస్తే.. ఖాతాలో నగదు చిక్కుకు పోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇది మీ వ్యాపారానికి సంబంధించిన ఇతర సమస్యలకు సైతం దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు శాఖలను మార్చేటప్పుడు మీరు ఈ ఐదు తప్పులు చేయకండి..


పాత శాఖకు తెలియజేయకుండా బదిలీ: ఖాతా బదిలీ చేయాలనుకున్నప్పుడు పాత శాఖకు తెలియజేయకపోతే.. బదిలీ ప్రక్రియను నిలిపి వేసే అవకాశముంది. మీరు పాత శాఖకు వెళ్లి బదిలీ చేయాలంటూ ఒక లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన ఫామ్‌(Form)ని నింపాల్సి ఉంటుంది. ఇది శాఖను సులభంగా మార్చడానికి సహాయపడుతుంది.


బ్రాంచ్ మారుతున్నప్పుడు కేవైసీ పత్రాలు అప్‌డేట్ చేయకపోవడం: రెండో తప్పు కేవైసీని అప్‌డేట్ చేయకపోవడం. అంటే బ్యాంక్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కొత్త చిరునామా జిరాక్స్‌తోపాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లను అగడవచ్చు. ఒక వేళ ఈ డాక్యుమెంట్లు పాతవి అయితే.. బదిలీలో ఆలస్యం జరగవచ్చు. బ్రాంచ్ మారే ముందు మీ కేవైసీ డాక్యుమెంట్లను తనిఖీ చేయడం ఎందుకైనా మంచిది.


కొత్త బ్రాంచ్ సేవలు తెలియకపోవడం: ఇక మూడో తప్పు. కొత్త బ్రాంచ్ సేవలను తనిఖీ చేయకపోవడం. ప్రతి బ్రాంచ్ సేవలు భిన్నంగా ఉండవచ్చు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. ఏటీఎమ్ లభ్యత, లాకర్ సౌకర్యం, ఆన్ లైన్ బ్యాంకింగ్. మీరు తనిఖీ చేయకుండా బ్రాంచ్‌లు మార్చుకుంటే.. ఆ తర్వాత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త బ్రాంచ్‌కు వెళ్లి.. అక్కడ అందుబాటులో ఉన్న సేవలను తెలుసుకోవాల్సి ఉంటుంది.


చెక్ బుక్, డెబిట్ కార్డ్ పునరుద్ధరణ: బ్రాంచ్‌ను మార్చిన తర్వాత.. పాత చెక్ బుక్, డెబిట్ కార్డు పాత బ్రాంచ్ చిరునామ, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌తోనే ఉంటాయి. అవి ఇకపై చెల్లవు. మీరు వెంటనే కొత్త బ్రాంచ్‌లో కొత్త చెక్ బుక్, డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే మీరు పాత చెక్ బుక్‌ను ఉపయోగిస్తుంటే.. మీ చెల్లింపులు నిలిపివేయబడే అవకాశం ఉంది.


ఆటోమేటిక్ చెల్లింపుల గురించి: మీ ఖాతాకు ఈఎంఐ, కరెంట్ బిల్లు, మొబైల్ రీఛార్జ్ మొదలైన ఆటోమేటిక్ చెల్లింపులు లింక్ చేయబడి ఉంటే.. వాటి స్థానంలో కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌తోపాటు కొత్త ఖాతా వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. వాటిని అప్‌డేట్ చేయకపోతే.. చెల్లింపులు విఫలమవుతాయి. దీంతో అదనపు రుసుం లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ తప్పులను నివారించడం ద్వారా.. మీరు సులభంగా బ్రాంచ్‌ను మారవచ్చు. బ్రాంచ్ మారే ముందు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మీ నగదు, సమయం రెండు సురక్షితంగా ఉంటాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే.. బ్యాంక్ కస్టమర్ సర్వీస్ లేదా బ్రాంచ్ మేనేజర్‌తో సంప్రదిస్తే సరిపోతుంది.

మరిన్నీ బిజినెస్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 05 , 2025 | 09:03 PM