Car Makers Boost Production: కార్ల ఉత్పత్తి పెంపు
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:44 AM
దేశీయ కార్ల పరిశ్రమ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. పండగ సీజన్ గిరాకీ, జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో గత నెలలో కంపెనీల కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో...
20-40% మేర పెంచేందుకు కంపెనీల సన్నాహాలు
టాప్‌గేర్‌లో విక్రయాలు
జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో బూస్ట్
న్యూఢిల్లీ: దేశీయ కార్ల పరిశ్రమ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. పండగ సీజన్ గిరాకీ, జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో గత నెలలో కంపెనీల కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో 5,57,373కు చేరాయి. దీంతో చాలా మంది డీలర్ల వద్ద స్టాకు లేకుండా పోయింది. ఈ నెల ప్రారంభానికి మారుతి సుజుకీ డీలర్ల వద్ద ఉండే కార్ల నిల్వలు 1.04 లక్షల యూనిట్లకు పడిపోయాయి. ఈ నిల్వలు 19 రోజుల అమ్మకాలకు మాత్రమే సరిపోతాయి. మరోవైపు ఆర్డర్లు మాత్రం 3.5 లక్షల యూనిట్లకు చేరాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు కంపెనీలు ఈ నెల ఉత్పత్తి సామర్ధ్యాన్ని సగటున 20 నుంచి 40 శాతం వరకు పెంచాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు నెలకు సగటున 1.72 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తున్న మారుతి సుజుకీ ఈ నెల రెండు లక్షల కార్లకు పైగా ఉత్పత్తి చేయనుంది. ఇందుకోసం కంపెనీ యూనిట్లు ఆదివారాలు కూడా పని చేస్తున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు చెప్పారు.
మిగతా కంపెనీలదీ అదే బాట
టాటా మోటార్స్ కూడా తన నెలవారీ కార్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఈ నెల 47,000 నుంచి 65,000-70,000కు పెంచుతోంది. హ్యుండయ్ మోటార్‌దీ ఇదే పరిస్థితి. డీలర్ల వద్ద నిల్వలు పెంచేందుకు ప్రస్తుతం ఈ కంపెనీ రెండు షిఫ్ట్‌ల్లో పని చేస్తోంది. పండగ సీజన్ గిరాకీతో పాటు జీఎ్‌సటీ రేట్ల కోతతో కార్ల డిమాండ్ అమాంతం పెరిగిందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ గిరాకీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగుతుందని టాటా మోటార్స్ భావిస్తోంది. అమ్మకాలు పెరగటంతో ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఉత్పత్తిని 20 నుంచి 40 శాతం పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
ఆరు శాతం అప్ !
నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం పరిశ్రమకు పెద్దగా కలిసి రాలేదు. అయితే జీఎ్‌సటీ రేట్ల కోతతో పండగ సీజన్‌లో కార్ల కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. గత ఏడాది ఫెస్టివల్ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది పండగల సీజన్‌లో అమ్మకాల గిరాకీ రికార్డు స్థాయిలో 25 శాతం పెరిగింది. దీంతో ఈ ఏడాది అక్టోబరు- 2026 మార్చి మధ్య కాలంలో అమ్మకాల డిమాండ్ 6 శాతం పెరిగే అవకాశం ఉందని కంపెనీల అంచనా. కొత్త మోడల్స్ విడుదల, ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ ద్వారా ఈ గిరాకీని తట్టుకోవాలని కార్ల కంపెనీలు భావిస్తున్నాయి.