Reduced Interest Rates: వడ్డీ రేట్లు తగ్గించిన కెనరా, ఇండియన్ బ్యాంక్
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:45 AM
కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తమ గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించాయి. ఈ వడ్డీ రేటు తగ్గింపుతో పాటు జీరో డాక్యుమెంటేషన్ చార్జీలు, డిస్కౌంటెడ్ ప్రాసెసింగ్ ఫీజులు కూడా అందిస్తున్నాయి
న్యూఢిల్లీ: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గించాయి. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తమ రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును పావు శాతం (0.25ు) మేర తగ్గించాయి. ఇండియన్ బ్యాంక్ గృహ రుణాలపై కనీస వడ్డీ రేటు 8.15 శాతం నుంచి 7.90 శాతానికి, వాహన రుణాలపై కనీస వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గాయి. వడ్డీ రేటు తగ్గింపుతో పాటు తమ రుణాలపై జీరో డాక్యుమెంటేషన్ చార్జీలు, డిస్కౌంటెడ్ ప్రాసెసింగ్ ఫీజు కూడా అమలు చేస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ తెలిపింది. కెనరా బ్యాంక్ కూడా తన గృహ రుణాల కనీస వడ్డీ రేటును 8.15 శాతం నుంచి 7.90 శాతానికి, వాహన రుణాల వడ్డీ రేటును 8.45 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.