Share News

Byjus Raveendran: ఆ పొరపాట్లే కారణం.. బైజూస్ పతనంపై సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 17 , 2025 | 10:13 PM

ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ పతనంపై సంస్థ సీజీఓ రవీంద్రన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ సమయంలో జరిగిన కొన్ని పొరపాట్లు ఈ పరిస్థితి తెచ్చిపెట్టాయని అన్నారు.

Byjus Raveendran: ఆ పొరపాట్లే కారణం.. బైజూస్ పతనంపై సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు
Byjus Raveendran

ఇంటర్నెట్ డెస్క్: బైజూస్.. కోవిడ్ సమయంలో మారుమోగిపోయిన పేరిది. భారత ఎడ్‌టెక్ రంగానికి ముఖచిత్రంగా నిలిచిన సంస్థ. ఆ తరువాత పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయి. ఒకప్పుడు 22 బిలియన్‌ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన సంస్థ ఆ తరువాత అనూహ్యంగా పతనమైంది. ఈ విషయాల గురించి సంస్థ సీఈఓ బైజు రవీంద్రన్ తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

సంస్థ ఉచ్ఛస్థితిలో ఉండగా భారత్ నుంచి 21 దేశాలకు కార్యకలాపాలను విస్తరించే సమయంలో జరిగిన పొరపాట్లు తమను దెబ్బతీశాయని రవీంద్రన్ అన్నారు. దీంతో పాటు.. ఈక్విటీ ప్రత్యామ్నాయాలకు బదులు 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోను తీసుకోవడం సంస్థను చిక్కుల్లోకి నెట్టేసిందని చెప్పారు.

‘‘ఆ తప్పే ఈ పరిస్థితికి దారి తీసింది. టర్మ్ లోను తీసుకుని ఉండాల్సింది కాదు. భారత్ నుంచి మా కార్యకలాపాలను 21 దేశాలకు విస్తరించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేశాము. అవన్నీ ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు. కాస్త నెమ్మదించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. కానీ 2019 నాటి కొవిడ్ పరిస్థితులు అలాంటివి. అప్పట్లో మా వెంట 160 ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు ఉన్నారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.


రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొందరు ఇన్వెస్టర్లు ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడులు పెట్టలేదని కూడా ఆయన తెలిపారు. ఇవన్నీ కంపెనీ విస్తరణ కార్యకలాపాలు, ఎక్వజిషన్లపై ప్రభావం చూపాయని చెప్పారు. ఫెడ్ రేట్స్ పెరగడం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ నిధుల లభ్యతను తగ్గించాయని చెప్పారు. బైజూస్ ద్వారా తాను 2.15 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలను కూడా సృష్టించాలనుకునట్టు చెప్పారు. అయితే, తాను ఓటమిని అంత సులువుగా ఒప్పుకోనని, మళ్లీ తాము నిలదొక్కుకుంటామని అన్నారు.


2015లో బైజూస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ అందరికీ అందుబాటులో ఆన్‌లైన్ విద్యను అందించేందుకు సంస్థ ప్రయత్నించింది. 2019 కల్లా సంస్థ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో యూనికార్న్‌ స్టార్టప్‌గా గుర్తింపు దక్కించుకుంది. 2022లో సంస్థ మార్కెట్ విలువ గరిష్ఠంగా 22 బిలియన్ డాలర్లు చేరుకుంది. ఆ తరువాత పలు పరిణామాల నేపథ్యంలో పతనమైపోయింది.

ఇవి కూడా చదవండి:

ఆదుకోండి.. మహాప్రభో

కెనడా సంస్థతో ప్యూర్ జట్టు..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 10:13 PM