RBI Draft Rules: ఐపీఓలో పెట్టుబడులకు బ్యాంకు రుణం
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:42 AM
తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ), మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీఓ) లేదా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈఎ్‌సఓపీ) ద్వారా షేర్లను కొనుగోలు చేసేందుకు వ్యక్తు...
వ్యక్తులకు రూ.25 లక్షల వరకు లోన్
కొనుగోళ్ల కోసం కంపెనీలకు ఫండింగ్..
బ్యాంకులకు ఆర్‌బీఐ ముసాయిదా మార్గదర్శకాలు
చీముంబై: తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ), మలి విడత పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీఓ) లేదా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈఎ్‌సఓపీ) ద్వారా షేర్లను కొనుగోలు చేసేందుకు వ్యక్తుల (ఇండివిడ్యువల్స్)కు బ్యాంకులు రుణాలిచ్చేందుకు వీలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ముసాయిదా నిబంధనలను శుక్రవారం జారీ చేసింది. అలాగే, భారత కంపెనీల వ్యూహాత్మక కొనుగోళ్లు, విలీనాలకు కూడా బ్యాంకులు నిధులు సమకూర్చేందుకూ అవసరమైన ముసాయిదా నిబంధనలను కూడా విడుదల చేసింది. హేతుబద్ధీకరించిన నిబంధనలను 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. తద్వారా వ్యక్తులు.. పబ్లిక్ ఇష్యూల్లో పెట్టుబడులు పెట్టేందుకు, కార్పొరేట్ కంపెనీలు ఇతర సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణకు అవకాశాలు పెరగనున్నాయి. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై నవంబరు 21లోగా అభిప్రాయాలు తెలపాలని సంబంధిత వర్గాలను ఆర్‌బీఐ కోరింది.
సబ్‌స్ర్కిప్షన్ విలువలో 75ు రుణం: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (కమర్షియల్ బ్యాంక్స్- క్యాపిటల్ మార్కెట్ ఎక్స్‌పోజర్) డైరెక్షన్స్, 2025’ ప్రకారం.. ఐపీఓ, ఎఫ్‌పీఓ, ఈఎ్‌సఓపీలో భాగంగా షేర్ల కొనుగోలుకు బ్యాంకులు.. వ్యక్తికి రూ.25 లక్షల వరకు రుణం మంజూరు చేయవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. అయితే, పబ్లిక్ ఆఫరింగ్ లేదా ఈఎ్‌సఓపీ సబ్‌స్ర్కిప్షన్ విలువలో బ్యాంకుల రుణ వాటా 75 శాతానికి మించకూడదని, మిగతా 25 శాతం రుణగ్రహీత సమకూర్చుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అలాగే, పబ్లిక్ ఆఫరింగ్స్, ఈఎ్‌సఓపీలో భాగంగా రుణగ్రహీతకు కేటాయించబడే షేర్లపై బ్యాంకులకు ధరావతు హక్కు కల్పించాలని, ఆ షేర్లను కేటాయించాక రుణగ్రహీత వాటిని బ్యాంకు వద్ద తనఖా పెట్టాల్సి ఉంటుదని తెలిపింది.
సెక్యూరిటీల తనఖాపై రూ.కోటి వరకు రుణం: ప్రభుత్వ సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రభుత్వ బాండ్లు, లిస్టెడ్ కంపెనీల షేర్లు, లిస్టెడ్ కన్వర్టబుల్ డెట్ సెక్యూరిటీలు, అధిక రేటింగ్ కలిగిన రుణ పత్రాల తనఖాపై వ్యక్తులకు బ్యాంకులు రూ.కోటి వరకు రుణం మంజూరు చేయవచ్చని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.20 లక్షలుగా ఉంది.
కంపెనీల కొనుగోళ్ల ఫండింగ్‌కు మార్గదర్శకాలు
కంపెనీల కొనుగోళ్ల కోసం అందించే రుణాల మొత్తం బ్యాంకు టియర్-1 క్యాపిటల్‌లో 10 శాతానికి మించకూడదు.
కొనుగోలు ఒప్పందం విలువలో 70 శాతం వరకు బ్యాంకులు రుణం మంజూరు చేయవచ్చు. మిగతా 30 శాతం కంపెనీయే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
గత మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తూ, సంతృప్తికరమైన నెట్‌వర్త్ కలిగిన లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే రుణాలు ఇవ్వాలి.