Apollo Hospitals: ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాల విభజన
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:52 AM
ప్రముఖ హాస్పిటల్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్‌ఈఎల్) తన వ్యాపారాలను పునర్ వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా అపోలో హాస్పిటల్స్‌కు...
18-21 నెలల్లో పూర్తి.. ఆ తర్వాతమార్కెట్లో లిస్టింగ్
అపోలో హాస్పిటల్స్ వెల్లడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రముఖ హాస్పిటల్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్‌ఈఎల్) తన వ్యాపారాలను పునర్ వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాలను ఒక ప్రత్యేక కంపెనీగా విభజించి, ఆ కంపెనీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన సమావేశంలో అపోలో హాస్పిటల్స్, దాని అనుబంధ సంస్థ అపోలో హెల్త్ కంపెనీ లిమిటెడ్ (ఏహెచ్‌ఎల్) డైరెక్టర్ల బోర్డులు ఇందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయి. అయితే కొత్త కంపెనీ పేరును ఇంకా నిర్ణయించలేదు. ఈ విభజన, షేర్ల లిస్టింగ్ ప్రకియను 18 నుంచి 21 నెలల్లో పూర్తి చేయాలని ఏహెచ్‌ఈఎల్ భావిస్తోం ది.ఈ విభజన ద్వారా ఏహెచ్‌ఈఎల్ ఈక్విటీలో 100 షేర్లు ఉన్న ప్రతి వాటాదారుకు.. కొత్తగా ఏర్పాటు చేసే ఫార్మసీ, డిజిటల్ హెల్త్ కంపెనీలో 195.2 షేర్లు లభిస్తాయి.
విభజన ప్రక్రియ ప్రధానాంశాలు
తొలి దశలో ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, అపోలో 24/7 డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్, రిమోట్ టెలిహెల్త్ వ్యాపారాలను ఏహెచ్‌ఈఎల్ నుంచి ప్రత్యేక కంపెనీగా విభజిస్తారు.
రెండో దశలో అపోలో హెల్త్ కంపెనీని కొత్త కంపెనీలో విలీనం చేస్తారు.
మూడో దశలో హోల్‌సేల్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కీమెడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీలో విలీనం చేస్తారు.
ఈ విభజనతో గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.16,300 కోట్లుగా ఉన్న ఫార్మసీ, డిజిటల్ హెల్త్ విభాగాల ఆదాయం 2027 మార్చి నాటికి రూ.25,000 కోట్లకు చేరుతుందని అంచనా.
విభజనతో ఏర్పడే కొత్త కంపెనీ పూర్తి భారతీయుల యాజమాన్యం, నిర్వహణలో ఉన్న కంపెనీ (ఐఓసీసీ) అవుతుంది.
ఈ కొత్త కంపెనీకి అపోలో గ్రూప్ నిర్వహణలోని ఫ్రంట్ ఎండ్ ఫార్మా కంపెనీ అయిన అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ (ఏపీఎల్) ఈక్విటీలో 100 శాతం వాటా ఉండనుంది.
ఏహెచ్‌ఈఎల్‌కు కొత్త కంపెనీ ఈక్విటీలో 15 శాతం వాటా.
కొత్తగా ఏర్పడే కంపెనీ బోర్డులోనూ ఏహెచ్‌ఈఎల్‌కు ఒక నామినీ డైరెక్టర్ పోస్టు.
వాటాదారులు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదం లభించిన తర్వాత కొత్త కంపెనీకి ఫ్రంట్ ఎండ్ ఫార్మా బిజినెస్ కంపెనీ అపోలో మెడికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీలోనూ 74.5 శాతం వాటా.
అపోలో హెల్త్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ శోభన కామినేని.. కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీకీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
ఏహెచ్‌ఈఎల్ ప్రమోటర్లు అందరూ కొత్త కంపెనీ బోర్డులో సభ్యులుగా ఉంటారు.
రేపటి డిజిటల్ తరం కోసం ముందుచూపుతో ఈ కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రతాప్ సి రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్
అపోలో హాస్పిటల్స్ ఆరోగ్య సేవలు అందించడంపైన దృష్టి పెడుతుంది. కొత్తగా ఏర్పడే కంపెనీ కస్టమర్లతో సంబంధాలు, వ్యాప్తిపై దృష్టి పెడుతుంది. రెండు కంపెనీలకు నిధుల కేటాయింపు, అభివృద్ధి ప్రణాళికలు, నిర్వహణ విషయాలు వేరు వేరుగా ఉంటాయి.
- సునీతా రెడ్డి,ఎండీ, ఏహెచ్‌ఈఎల్.