Apollo Genomics Institute: విశాఖలో అపోలో జినోమిక్స్ ఇనిస్టిట్యూట్
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:49 AM
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా దేశంలోని తూర్పు, ఉత్తర, సెంట్రల్ ప్రాంతాలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొత్తగా ఐదు అపోలో జినోమిక్స్...
మరో నాలుగు నగరాల్లో కూడా ఏర్పాటు
ముంబై: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా దేశంలోని తూర్పు, ఉత్తర, సెంట్రల్ ప్రాంతాలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొత్తగా ఐదు అపోలో జినోమిక్స్ ఇనిస్టిట్యూట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఈ ఇనిస్టిట్యూట్ ఉంది. వీటి ఏర్పాటు వల్ల ప్రధాన క్లినికల్ కేర్ విభాగంలోకి జినోమిక్స్‌ను మరింతగా అనుసంధానం చేయగలుగుతామని పేర్కొంది. విశాఖతో పాటు గువాహటి, భువనేశ్వర్, లఖ్‌నవూ, ఇండోర్‌లలో కూడా ఈ ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేయనున్నట్టు అపోలో మెడికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అనుపమ్ సిబాల్ తెలిపారు. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతాల్లో 12 ఇనిస్టిట్యూట్స్ పని చేస్తున్నాయి. వివిధ రోగాలు, వాటికి సంబంధించిన పరిస్థితుల అన్వేషణలో జెనెటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అంతేకాకుండా ఇవి రోగికి వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలు తయారు చేసి, మార్గదర్శకం చేయడంలో సహాయకారిగా ఉంటాయన్నారు. ప్రస్తుతం అపోలో జినోమిక్స్ ఇనిస్టిట్యూట్స్ 11 వేల కన్సల్టేషన్ల మైలురాయిని చేరాయని వెల్లడించారు. జినోమిక్ సీక్వెన్సింగ్‌కు రూ.60,000, టార్గెటెడ్ సీక్వెన్సింగ్‌కు రూ.18,000 చార్జి చేస్తున్నట్టు తెలిపారు.