Share News

బీమా వ్యాపారంలోకి అపోలో 24 బై 7

ABN , Publish Date - May 15 , 2025 | 03:36 AM

అపోలో హెల్త్‌ కంపెనీ అనుబంధ సంస్థ, డిజిటల్‌ హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌ అపోలో 24/7.. బీమా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం, క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా...

బీమా వ్యాపారంలోకి అపోలో 24 బై 7

త్వరలో కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపోలో హెల్త్‌ కంపెనీ అనుబంధ సంస్థ, డిజిటల్‌ హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌ అపోలో 24/7.. బీమా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం, క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా త్వరలోనే ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా ఉత్పత్తుల విక్రయం, డిస్ట్రిబ్యూషన్‌ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు అపోలో హెల్త్‌ కంపెనీ సీఈఓ మాధివానన్‌ బాలకృష్ణన్‌ వెల్లడించారు. బుధవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ.. బీమా ఉత్పత్తులకు సంబంధించి అపోలో 24/7 కార్పొరేట్‌ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు ఇప్పటికే అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు అందుకుందని ఆయన వివరించారు. ఇప్పటికే 8 బీమా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందులో 4 ఆరోగ్య బీమా సంస్థలని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మరో 4 కంపెనీలతో జట్టు కట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీమా వ్యాపారం ప్రారంభించిన ఏడాది కాలంలో లక్ష పాలసీల విక్రయం, రూ.80-రూ.100 కోట్ల ప్రీమియం ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాలకృష్ణన్‌ వెల్లడించారు. అపోలో 24/7 12 కోట్ల మంది తో పటిష్ఠమైన యూజర్‌ బేస్‌ కలిగి ఉందని, బీమా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపార విస్తరణకు ఇది ఎంతగానో తోడ్పడనుందని ఆయన చెప్పారు.


క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలోకి అడుగు

అపోలో 24/7 క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలోకి అడుగు పెడుతోందని బాలకృష్ణన్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రముఖ క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీతో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వచ్చే పదిహేను రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఔషధాలు, డయాగ్నోస్టిక్స్‌ సేవలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌, వెల్‌నెస్‌ సర్వీసులపై ప్రత్యేక బెనిఫిట్స్‌ను ఈ కార్డు ద్వారా అందించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా అపోలో 24/7 ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా అల్టిమేట్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు బాలకృష్ణన్‌ వెల్లడించారు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 15 , 2025 | 03:36 AM