GST Reduction: ఈ ఏడాది అమ్మకాల్లో 7 శాతం వృద్ధి
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:18 AM
జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణతో దేశంలో కార్ల మార్కెట్ వృద్ధి రేటు మళ్లీ గాడిలో పడుతుందని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి...
చిన్న కార్ల అమ్మకాలు పుంజుకునే అవకాశం
ఆటోమొబైల్ పరిశ్రమ అంచనా
న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణతో దేశంలో కార్ల మార్కెట్ వృద్ధి రేటు మళ్లీ గాడిలో పడుతుందని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాల వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1 నుంచి 2 శాతానికి మించి ఉండకపోవచ్చని నిన్న మొన్నటి వరకు పరిశమ్ర వర్గాలు అంచనా వేశాయి. జీఎ్‌సటీ మండలి తాజా నిర్ణయంతో ఎంట్రీ లెవల్ కార్లపై జీఎ్‌సటీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ అమ్మకాల వృద్ధి రేటు 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) చైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు. పండగల సీజన్ నుంచే ఈ తగ్గింపు అమల్లోకి రావడం మరింత శుభ పరిణామమన్నారు. ఈ నిర్ణయంతో దేశంలో ఎంట్రీ లెవల్ కార్ల ధరలూ 8.5 నుంచి 9 శాతం (రూ.45,000 నుంచి రూ.50,000) తగ్గి వాటి అమ్మకాలూ మరింత పుంజుకునే అవకాశం ఉందన్నారు. కొన్ని ఎంట్రీ లెవల్ మోడల్ కార్ల ధర అయితే రూ.లక్ష వరకు కూడా తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
సిమెంట్ ధర రూ.30 వరకు తగ్గే చాన్స్
సిమెంట్‌పై ఉన్న 28 శాతం జీఎ్‌సటీని 18 శాతానికి తగ్గించడంపై సిమెంట్ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. దీనివల్ల ధరలు తగ్గి మౌలిక సదుపాయాల రంగం ఊపందుకుంటుందని సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) తెలిపింది. దీంతో 50 కిలోల బస్తా సిమెంట్ ధర రూ.25 నుంచి రూ.30 వరకు తగ్గవచ్చని జేఎం ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ సంస్థ అంచనా. కాగా ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హోల్‌సేల్ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.370 నుంచి రూ.385 వరకు ఉంది. జీఎస్‌టీ తగ్గింపుతో ఇది రూ.15 నుంచి రూ.20 వరకు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక సిమెంట్ కంపెనీ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి బిజినె్‌స’తో చెప్పారు.
సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ షురూ
మారిన జీఎస్‌టీ రేట్లకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ ప్రక్రియ ఊపందుకుంది. కొత్త జీఎస్‌టీ రేట్లు అమల్లోకి వచ్చే ఈ నెల 22వ తేదీ లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం ఉందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. ఇందుకోసం కంపెనీలతోనూ చర్చిస్తున్నట్టు తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తేనే కొత్త జీఎ్‌సటీ రేట్ల అమలు సాఫీగా జరుగుతుందన్నారు. అప్పుడు కంపెనీలు కూడా తమ రిటర్న్‌లను సాఫీగా అప్‌లోడ్ చేయగలుగుతాయని అగర్వాల్ చెప్పారు.
జీఎస్‌టీ తగ్గింపు సరైన చర్య
డెయిరీ ఉత్పత్తులపై జీఎస్‌టీ తగ్గింపు సకాలంలో తీసుకున్న సరైన చర్య. సగటు గృహస్థులు అధికంగా వినియోగించే పన్నీర్‌ను జీఎ్‌సటీ శ్లాబ్‌లోకి తేవడం, నెయ్యి, వెన్న, చీజ్‌పై రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల వారికి ఎంతో ఊరట కల్పిస్తుంది. అత్యధిక నాణ్యత గల, బ్రాండెడ్ ఉత్పత్తులు.. అవ్యవస్థీకృత రంగ ఉత్పత్తులతో దీటుగా పోటీ పడే అవకాశం ఏర్పడుతుంది. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని మేం పూర్తిగా వినియోగదారులకే పంచాలని భావిస్తున్నాం. రేట్ల పరివర్తన ప్రక్రియ సరళంగా సాగేందుకు భాగస్వాములు, పంపిణీదారులతో కలిసి మేం పని చేస్తున్నాం. పెరగనున్న డిమాండ్‌కు దీటుగా ఉత్పత్తి సామర్థ్యాలు పెంచేందుకు మేం ఎదురుచూస్తున్నాం.
- నారా భువనేశ్వరి, వైస్ చైర్‌పర్సన్, ఎండీ, హెరిటేజ్ ఫుడ్స్